దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నరు : మధు యాష్కీ గౌడ్

దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నరు : మధు యాష్కీ గౌడ్
  • మోదీ, కేసీఆర్.. దేశాన్ని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన్రు: మధు యాష్కీ గౌడ్

బషీర్ బాగ్, వెలుగు : తెలంగాణ రాష్ట్రం తరహాలో దేశ ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్  మధు యాష్కీ గౌడ్ అన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం మోదీ ట్యాక్స్ నడుస్తున్నదని, దేశ ప్రజల నుంచి వసూలు చేసిన ట్యాక్స్ ను 21 మంది పారిశ్రామిక వేత్తలకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు.

హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) అధ్యక్షుడు విరాహత్​అలీ ఆధ్వర్యంలో మధుయాష్కీ గౌడ్​తో మీట్ ది ప్రెస్ నిర్వహించారు. ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్  మాట్లాడుతూ..మోదీ, కేసీఆర్.. దేశాన్ని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు. దేశంలో రాజ్యాంగాన్ని రద్దుచేసి

రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్రలో భాగంగానే తమకు 400 సీట్లు ఇవ్వాలని ప్రజలను మోదీ కోరుతున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ తన పాలనలో తెలంగాణను సర్వనాశనం చేశారని విమర్శించారు. తెలంగాణలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని విమర్శించారు.  

రాష్ట్రంలో పదికిపైగా ఎంపీ సీట్లు గెలుస్తం.. 

తమ నాలుగు నెలల పాలన ప్రజల ఆదరణను పొందిందని.. రాష్ట్రంలో పదికిపైగా ఎంపీ స్థానాల్లో గెలుస్తామని మధు యాష్కీ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎలాంటి అవినీతికి తావివ్వకుండా పాలన సాగిస్తుండడంతో జీర్ణించుకోలేని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారని దృష్ప్రచారం చేస్తున్నారన్నారు. కాళ్లకు చెప్పులు లేని మాజీ మంత్రి హరీశ్​రావు వేల కోట్లకు ఎలా ఎదిగారని ఆయన ప్రశ్నించారు.