తమిళనాడు అటవీ ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో ఎల్లో క్రేజీ యాంట్స్ అనే చీమలు విజృంభిస్తున్నాయి. ఏది కనబడితే దాన్ని తినేస్తుండటంతో ప్రజలు భయపడుతున్నారు. కొందరు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. దిండుక్కల్ జిల్లా కరంతమలై రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లోని సుమారు 7 గ్రామాలపై ఎల్లో క్రేజీ యాంట్స్ దండయాత్ర చేస్తున్నాయి.
పంటపొలాలు,పశువులకు హానీ
సన్నగా.. చిన్నగా ఉండే ఎల్లో క్రేజీ యాంట్స్ చిన్నచిన్న కీటకాలను, పురుగులను చంపేస్తుంటాయి. స్థానిక జాతుల కీటకాలు, చీమల పుట్టల్ని ఆక్రమించి వాటిని నాశనం చేస్తుంటాయి. పంటపొలాల్ని నాశనం చేస్తుండటంతోపాటు రైతులకు చెందిన మేకలు, పశువులకు హాని చేస్తున్నాయి. ఎలుకలు, పిల్లులు, కుందేళ్లు,పాములు, బల్లులను కూడా చంపేస్తున్నాయి. పశువులకు గాయాలైన చోట్ల మాంసాన్ని తినేస్తున్నాయి. వీటి ప్రభావంతో కొన్ని పశువులు చనిపోయాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేకలు చూపు కోల్పోతున్నాయి.
గ్రామాల్లోకి లక్షల సంఖ్యలో చీమలు
ఎల్లో క్రేజీ యాంట్స్ బెడద గతంలో ఎప్పుడూ లేదని తెలిపారు స్థానికులు. అడవుల నుంచి గ్రామాల్లోకి లక్షల సంఖ్యలో చీమలు వస్తున్నాయన్నారు. చల్లటి వాతావరణంలో వీటి దాడి మరింత ఎక్కువగా ఉంటోంది. ఇంటినుంచి బయటికి రావడానికే భయపడుతున్నారు. ఎక్కడైనా నిల్చుంటే చాలు సెకన్లలోనే శరీరం పైకి పాకేస్తున్నాయి. ఈ చీమలు ఫార్మిక్ యాసిడ్ తో కూడిన ద్రవాన్ని వెదజల్లుతుంటాయి. ఆ యాసిడ్ పడినచోట దురద, చర్మం పొట్టులా రాలడం వంటి సమస్యలు వస్తాయి. పశువులు, పక్షుల కంట్లో పడితే చూపు పోతుంది. వాగులు, కుంటల్లో నీళ్లు తెచ్చుకోవాలన్నా అక్కడా వేల సంఖ్యలో చీమలుంటున్నాయని, పరిస్థితి దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. చీమల మందు వంటివి చల్లుతున్నా వాటి తీవ్రత తగ్గడం లేదని తెలిపారు.
ఎల్లో క్రేజీ యాంట్స్ అత్యంత ప్రమాదకరమైనవి
ప్రజల నుంచి కంప్లైంట్లు వస్తుండటంతో, కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుండటంతో కీటక శాస్త్రవేత్తలు, అటవీశాఖ అధికారులు వీటిపై దృష్టిపెట్టారు. నమూనాల్ని సేకరించి పరిశోధనకు పంపారు. ఎల్లో క్రేజీ యాంట్స్ అత్యంత ప్రమాదకరమైనవి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం ప్రపంచంలోని తొలి వంద ప్రమాదకర జాతుల్లో వీటిని చేర్చారని.. తెలిపారు పర్యావరణ వేత్తలు.
ఎల్లో క్రేజీ యాంట్స్ దాడులు గతంలో కేరళ అడవుల్లోని పలు గ్రామాల్లో కనిపించాయి. వాటిపై సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ ప్రతినిధులు పరిశోధనలు చేశారు. గతంతో పోలిస్తే... ఇప్పుడు ఈ చీమల జాతుల విస్తరణ బాగా పెరుగుతోందన్నారు సైంటిస్టులు. ఆసియా, ఆస్ట్రేలియా, పశ్చిమ ఆఫ్రికాలో ఎల్లో క్రేజీ యాంట్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. 5మిల్లీమీటర్ల వరకు పొడవు ఉంటాయి. 80 రోజుల వరకు బతుకుతాయి.
ఆస్ట్రేలియాలో లక్షలాది ఎర్ర పీతలను చంపి తినేసిన ఎల్లో క్రేజీ యాంట్స్
ఆస్ట్రేలియాలోని క్రిస్ మస్ ఐలాండ్ లోకి అడుగుపెట్టిన ఎల్లో క్రేజీ యాంట్స్ అక్కడుండే లక్షలాది ఎర్ర పీతలను చంపి తినేశాయి. దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింది. దీంతో అక్కడ వాటిపై చాలా పరిశోధనలు చేసి.... వాటి నివారణకు హెలికాప్టర్ల ద్వారా మందుల్ని స్ప్రే చేశారు. 95-99 శాతం రిజల్ట్స్ వచ్చాయన్నారు అక్కడి సైంటిస్టులు. చీమల ఫుడ్ చెయిన్ తెంపి వాటి సంతతి పెరగకుండా చూసేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి.
