ఇసుక ఎక్కువ ధరకు అమ్మితే రెండేళ్ల జైలు!

ఇసుక ఎక్కువ ధరకు అమ్మితే రెండేళ్ల జైలు!
  • నవంబరు 14 నుంచి 21 వరకు వారోత్సవాలు
  • ఇసుక కొరత తీరే వరకూ అధికారులకు నో సెలవు: సీఎం జగన్

ఏపీలో ఇసుక కొరతను తీర్చడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా నవంబరు 14 నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. గతంలో సరాసరి ఇసుక డిమాండ్‌ 80 వేల టన్నులు ఉండేదని, వరదలు కారణంగా, రీచ్‌లు మునిగిపోవడంతో ఈ డిమాండ్‌ను చేరుకోలేకపోయామని ఆయన అన్నారు. గడిచిన వారం రోజులుగా పరిస్థితి కొంత మెరుగు పడిందన్నారు. 1.20 లక్షల టన్నులకు రోజువారీగా ఇసుక తీయగలుగుతున్నామని చెప్పారు.  రీచ్‌ల సంఖ్య సుమారు 60 నుంచి 90 వరకు చేరిందన్నారు.

వారంలో రెట్టింపు ఇసుక..

ఇసుక వారోత్సవాల్లో భాగంగా స్టాక్ పాయింట్లను 137 నుంచి 180 వరకూ పెంచాలని టార్గెట్ పెడుతున్నట్లు సీఎం జగన్ చెప్పారు. అలాగే 1.2లక్షల టన్నులను నుంచి 2 లక్షల టన్నుల వరకూ ఇసుక అందుబాటులోకి రావాలని ఆదేశించారాయన. స్టాక్ పాయింట్లు పెంచే బాధ్యతను జాయింట్ కలెక్టర్లే తీసుకోవాలన్నారు. ఇసుక కొరత తీరే వరకూ అధికారులు, సిబ్బంది సెలవు తీసుకోకూడదని ఆదేశించారు. అక్రమ రవాణా జరగకుండా చెక్ పోస్టులు పెంచాలన్నారు. ఎక్కడైనా ప్రభుత్వం నిర్ణయించిన దానికన్నా రేటు పెంచి ఇసుక అమ్మితే రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. దీనిపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు జగన్.