కోహ్లీని కలిసినప్పుడల్లా... ఏదో ఒకటి నేర్చుకుంటున్నా : బాబర్ ఆజం

కోహ్లీని కలిసినప్పుడల్లా... ఏదో ఒకటి నేర్చుకుంటున్నా : బాబర్ ఆజం

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని కలిసినప్పుడల్లా బ్యాటింగ్‌కు సంబంధించి అతని నుండి ఏదో ఒక మెలుకువ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తానని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన కోహ్లి లాంటి దిగ్గజంతో పోల్చడం తనకు అపారమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని తెలిపాడు. 

"మీకంటే గొప్పవారితో మిమ్మల్ని పోల్చినప్పుడు అది అందరికీ ఆనందాన్ని ఇచ్చేదే. నాకూ అంతే. నేను అతన్ని(కోహ్లీ) కలిసినప్పుడల్లా అతని నుండి ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను.." అని 'షోటైమ్ విత్ రమీజ్ రాజా' కార్యక్రమంలో బాబర్  అన్నారు.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో టీ20 వరల్డ్ కప్ 2021 మ్యాచ్ సందర్భంగా బాబర్ ఆజాం, విరాట్ కోహ్లీ ఒకరినొకరు కలుసుకున్నారు. అనంతరం 2023 వన్డే ప్రపంచ కప్ సంధర్బంగా అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్ సమయంలో మరోసారి కలిశారు.

ఐర్లాండ్ పర్యటన

ప్రస్తుతం బాబర్ నాయకత్వంలోని పాకిస్తాన్ జట్టు.. ఐర్లాండ్‌లో పర్యటిస్తోంది. బాబర్ సేన.. ఆతిథ్య జట్టుతో 3-మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. తొలి టీ20లో బాబర్ 43 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 57 పరుగులు చేశాడు. కానీ  ఆ పరుగులు జట్టును గెలిపించలేకపోయాయి. తొలి టీ20లో ఐర్లాండ్ 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 1-0 ఆధిక్యంలో నిలిచింది.

టీ20ల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు (38) సాధించిన విరాట్ కోహ్లీ రికార్డును బాబర్ సమం చేశాడు . విరాట్ కోహ్లీ, సుజీ బేట్స్ తర్వాత టీ20ల్లో 4000 పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా 29 ఏళ్ల అతడు 120 పరుగుల దూరంలో ఉన్నాడు. 2024 టీ20 ప్రపంచ కప్‪లో భాగంగా జూన్ 9న భారత్‌ - పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది.