- కాంగ్రెస్, కమ్యూనిస్టులు మరింత బలపడాలి: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- లేబర్ కోడ్ అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేసే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని వ్యాఖ్య
ముషీరాబాద్, వెలుగు: ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దించేందుకు వామ పక్షాలు, లౌకిక శక్తులన్నీ కలిసి ఉద్యమించాలని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు మరింత బలపడాలని, అప్పుడే మోదీని గద్దె దించవచ్చన్నారు. కార్మిక కష్టంపైనే భారతదేశం నడుస్తుందని, అలాంటి కార్మికుల హక్కులను కాలరాస్తూ లేబర్ కోడ్స్ ప్రవేశపెట్టారని మండిపడ్డారు. వామ పక్షాల మద్దతుతోనే కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్, కనీస వేతనాలు, 8 గంటల పని తదితర కార్మిక చట్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని వివరించారు.
కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా హైదరాబాద్ లో గురువారం భారీ ప్రదర్శన చేపట్టారు. ఆర్టీసీ కల్యాణ మండపం నుంచి ఇందిరాపార్క్ వరకు వామపక్ష పార్టీలు సంఘాలు కార్మిక, రైతు, ప్రజా సంఘాలు కధం తొక్కాయి. ర్యాలీ పొడవునా మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ కు పెద్ద ఎత్తున తరలిరావడంతో ధర్నా చౌక్ దద్దరిల్లిపోయింది. ఏఐటీయూసీ, ఐఎన్ హెచ్ సీఐటీయూ, టీయూసీఐ, ఐఎఫ్ బీఆర్ ఏఐయూటీయూసీ, టీఎన్ కేంద్ర, రాష్ట్ర ఉద్యోగుల ఫెడరేషన్లు, అసోసియేషన్ల, రైతు సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
కార్మిక సంఘాల నేతలు ఎస్.బాల్ ఎం.నర్సింహ్మా (ఏఐటీయూసీ), పాలడగు భాస్కర్(సీఐటీయూ), ఎస్ పద్మ (టీయూసీఐ), తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, టీ సాగర్, పాలడుగు భాస్కర్, ఎస్ ఎల్ పద్మ, ఎం శ్రీనివాస్, వేముల మారయ్య, భరత్, ఆటో డ్రైవర్ యూనియన్లు, గిగ్ వర్కర్స్ యూనియన్, బ్యాంక్, మున్సిపల్, జీహెచ్ కార్మిక నాయకులు పాల్గొని మాట్లాడారు. పెట్టుబడిదారి విధానం పెరిగితే పేదరికం,దోపిడీ పెరుగుతుందని లేబర్ కోడ్స్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్స్ కు సంబంధించి గత రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన రూల్స్ కూడా రద్దు చేయాలని కోరారు.
