మెగా వారసుల నామకరణం.. 'శివరామ్', 'అన్వీరా దేవి' పేర్ల వెనుక ఉన్న అంతరార్థం ఇదే!

మెగా వారసుల నామకరణం.. 'శివరామ్', 'అన్వీరా దేవి' పేర్ల వెనుక ఉన్న అంతరార్థం ఇదే!

మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. గతేడాది జూన్ 20న క్లీంకార రాకతో మొదలైన ఈ సందడి.. ఇప్పుడు కవల పిల్లల రాకతో రెట్టింపయ్యింది. జనవరి 31న ఉపాసన కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా ఈ చిన్నారులకు 'నామకరణ మహోత్సవం' అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చరణ్ తన పిల్లలకు పెట్టిన పేర్ల వెనుక ఉన్న విశిష్టతను వివరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.

తండ్రి వారసత్వం.. దైవత్వం 

మెగా వారసుడికి 'శివరామ్' అని నామకరణం చేశారు. ఈ పేరు ఎంపిక వెనుక చరణ్‌కు తన తండ్రి చిరంజీవిపై ఉన్న అపారమైన ప్రేమ కనిపిస్తుంది.  చిరంజీవి అసలు పేరు 'శివశంకర వరప్రసాద్'. తండ్రి పేరులోని 'శివ'ను, తన పేరులోని 'రామ్'ను కలిపి కొడుక్కి నామకరణం చేయడం ద్వారా తన తండ్రికి గొప్ప గౌరవాన్ని ఇచ్చారు చరణ్. అంతే కాకుండా శివుడి ఆజ్ఞాబలం, రాముడి ధర్మనిరతి రెండూ కలగలిసిన పేరిది. శక్తితో పాటు నిగ్రహం, భక్తితో పాటు నీతి అనే ఆశయాలకు ఈ పేరు ప్రతిబింబం అని చరణ్ పేర్కొన్నారు.

స్త్రీ శక్తికి ప్రతిరూపం 

ఇక తన కూతురి 'అన్వీరా దేవి' పేరు వెనుక కూడా లోతైన అర్థం దాగి ఉందని వివరించారు రామ్ చరణ్.  'వీర' అంటే ధైర్యం, 'అన్' అంటే అపరిమితం. వెరసి 'అన్వీరా' అంటే హద్దులు లేని ధైర్యం కలిగినది అని అర్థం అని చెప్పారు.  బలం , దయ  రెండూ ఒకే చోట ఉండాలనే ఉద్దేశంతో 'దేవి' అనే పదాన్ని చేర్చినట్లు చరణ్ వివరించారు. ఈ పేర్లు కేవలం పిలవడానికి మాత్రమే కాదు, వారి వ్యక్తిత్వాన్ని నిర్దేశించే ఆశయాలని ఆయన వెల్లడించారు.
 
ఉపాసన మనసులోని మాట

ఈ వేడుకలో ఉపాసన తన మాతృత్వ అనుభూతులను పంచుకుంటూ.. రెండోసారి తల్లి కావడం తనలో మరింత పరిణతిని తెచ్చిందని చెప్పారు. "మొదటిసారి తల్లి అయినప్పుడు అంతా కొత్తగా, కొంత కంగారుగా ఉండేది. కానీ ఈసారి నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందడం మానేసి, పిల్లలతో గడిపే ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. ముగ్గురు పిల్లలనూ చూస్తుంటే ఏదో తెలియని పరిపూర్ణత  కనిపిస్తోందని తెలిపారు. ఇక క్లీంకార బాధ్యతలను చరణ్ పూర్తిగా తన భుజాన వేసుకున్నారని, తండ్రీకూతుళ్ల మధ్య ఆ బంధం చూడముచ్చటగా ఉందని ఆమె మురిసిపోయారు. 

 

మొత్తానికి, మెగా ఫ్యామిలీ తమ సంప్రదాయాలను, ఆధునికతను జోడిస్తూ పిల్లలకు పెట్టిన ఈ పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు మెగా అభిమానులు, ఇటు నెటిజన్లు చిన్నారులకు దీవెనలు అందజేస్తున్నారు.