'అమరావతికి ఆహ్వానం'.. హారర్‌తో పాటు అదిరిపోయే ట్విస్టులు!

 'అమరావతికి ఆహ్వానం'.. హారర్‌తో పాటు అదిరిపోయే ట్విస్టులు!

తెలుగు ప్రేక్షకులకు హారర్ థ్రిల్లర్ జోనర్ అంటే ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. సరైన కంటెంట్, వెన్నులో వణుకు పుట్టించే సీన్లు ఉంటే చిన్న సినిమాలనైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఈ రోజు (ఫిబ్రవరి 13, 2026) ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ ‘అమరావతికి ఆహ్వానం’. టైటిల్‌లో అమరావతి ఉండటంతో ఇది పొలిటికల్ సినిమా అని అంతా భావించినా, మేకర్స్ మాత్రం ఇది పక్కా హారర్ మూవీ అని ముందే క్లారిటీ ఇచ్చారు. మరి ఈ సినిమా ఏ మేరకు భయపెట్టింది? కథలో ఉన్న ట్విస్టులేంటి? చూద్దాం..

కథేంటంటే..

ఈశ్వర్ (శివ కంఠంనేని) ఒక సస్పెండెడ్ సి.ఐ. తన భార్య భానుమతి (ధన్య బాలకృష్ణ), ఆమె చెల్లెళ్లు భార్గవి (సుప్రిత), విజ్జులతో కలిసి జీవిస్తుంటాడు. భార్గవికి సోషల్ మీడియాలో సెలబ్రిటీ కావాలనే పిచ్చి. అందుకోసం ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టి, 'దెయ్యంతో డే అండ్ నైట్' అనే కాన్సెప్ట్‌తో వీడియోలు తీస్తుంటుంది. ఈ క్రమంలోఒక పాడుబడ్డ ఇంట్లో ఆమె తీసిన వీడియో వైరల్ అయ్యి, రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోతుంది.

అప్పుడే ఆమెకు ఒక అజ్ఞాత వ్యక్తి నుండి కాల్ వస్తుంది. "దెయ్యాలు ఉన్నాయని నేను లైవ్‌లో నిరూపిస్తాను, మా ఊరు అమరావతికి రండి" అని ఆహ్వానిస్తాడు. మరింత పాపులారిటీ కోసం భార్గవి తన కుటుంబంతో కలిసి అమరావతి గ్రామానికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక ఆ కుటుంబానికి ఎదురైన వింత పరిణామాలు ఏంటి? అసలు ఆ గ్రామానికి, జమీందారు వంశ వారసురాలు రాజేశ్వరి (ఎస్తేర్) మరణానికి ఉన్న సంబంధం ఏంటి? ఈశ్వర్ సస్పెన్షన్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? అనేదే మిగతా కథ.

హారర్ అండ్ ఎమోషన్

దర్శకుడు జీవీకే ఒక రొటీన్ హారర్ కథకు ఫ్యామిలీ ఎమోషన్స్ , రివెంజ్ డ్రామాను జోడించి ఆసక్తికరంగా మలిచారు. సినిమా ప్రారంభంలోనే హారర్ మూడ్‌లోకి తీసుకెళ్లిన దర్శకుడు, ఆ తర్వాత కథను హైదరాబాద్‌కు షిఫ్ట్ చేసి పాత్రలను పరిచయం చేశారు. ఫస్టాఫ్ అంతా యూట్యూబ్ వీడియోలు, ప్రేమ సన్నివేశాలతో సరదాగా సాగిపోతుంది. అయితే, ఎప్పుడైతే కథ అమరావతి గ్రామానికి చేరుతుందో, అప్పటి నుండి అసలు థ్రిల్ మొదలవుతుంది.

►ALSO READ | 'వారణాసి' జానర్‌పై రాజమౌళి క్లారిటీ.. అది సైన్స్ ఫిక్షన్ కాదు.. అంతకు మించి!

ప్రీ-ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాపై అంచనాలను పెంచుతుంది. సెకండాఫ్‌లో వచ్చే రాజేశ్వరి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు ప్రాణం పోసింది. ఒక ఆత్మ ఎందుకు పగ తీర్చుకోవాలనుకుంటుంది అనే అంశాన్ని ఎమోషనల్‌గా చూపించారు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. హారర్ సినిమాల్లో పాటలు స్పీడ్ బ్రేకర్లలా అనిపిస్తాయి, కానీ ఇందులో 'డుం డుం డియ్యాల' సాంగ్ మాస్ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది.

ఎవరెవరు ఎలా చేశారంటే?

శివ కంఠంనేని ఈశ్వర్, జగదీష్ అనే రెండు విభిన్నమైన పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఒకవైపు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, మరోవైపు విలనిజం పండించడంలో ఆయన మెప్పించారు. ఎస్తేర్ రాజేశ్వరి పాత్రలో సినిమాకు పిల్లర్‌లా నిలిచింది. ఆమె నటనలో పరిణతి కనిపిస్తుంది. ధన్య బాలకృష్ణ తన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించగా, సుప్రిత తన తొలి సినిమాలోనే ఈజ్ ఉన్న నటిగా గుర్తింపు తెచ్చుకుంది. జెమినీ సురేష్, భద్రమ్ తమ కామెడీతో నవ్వించారు.

సినిమాకు ప్రధాన బలం పద్మనాభ్ భరద్వాజ్ సంగీతం. హారర్ సీన్లలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. జె. ప్రభాకర్ రెడ్డి కెమెరా పనితనం బాగుంది, పల్లెటూరి వాతావరణాన్ని, భయానక దృశ్యాలను చక్కగా బంధించారు. హనుమాన్ ఫేమ్ సాయి బాబు తలారి ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గలేదు. ‘అమరావతికి ఆహ్వానం’ కేవలం భయపెట్టడమే కాదు, ఒక మంచి సందేశాన్ని కూడా ఇస్తుంది. హారర్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక మంచి విందు. క్లైమాక్స్‌లో దీనికి సీక్వెల్‌గా 'అమరావతికి ఆహ్వానం-2' ను ప్రకటించడం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది..