మెగా కృష్ణా రెడ్డి కోసమే అపెక్స్ వాయిదా

మెగా కృష్ణా రెడ్డి కోసమే అపెక్స్ వాయిదా

ఆయనకు పోతిరెడ్డిపాడు టెండర్లు వచ్చేలా సీఎం ప్రయత్నాలు
జగన్, మెగాకృష్ణారెడ్డి సలహాలతో కేసీఆర్ ముందుకెళ్తున్నరు
మాజీ ఎంపీ,బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: ‘‘మెగా కృష్ణారెడ్డికి పోతిరెడ్డిపాడు టెండర్లు వచ్చేలా చేయడానికే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వాయిదా వేయమని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. కృష్ణారెడ్డి మాటలు వింటున్నవ్ తప్ప.. ప్రజలకు న్యాయం చేయాలని గానీ, ఏపీ ప్రాజెక్టులను అడ్డుకోవాలని గానీ కేసీఆర్ కు లేదు. ఏపీ కాంట్రాక్ట‌ర్ల‌ మాట విని రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నవ్. ఇంత పెద్ద సమస్యను పక్కన పెట్టి సెక్రటేరియట్ డిజైన్లు, నిర్మాణం గురించి ఆలోచిస్తున్నవ్. ప్రగతిభవన్ లో పెద్ద భవనాలు, కాన్ఫరెన్స్ హాల్స్ కట్టుకున్నవ్. దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతున్నా పట్టించుకోవడం లేదు. మెగా కృష్ణారెడ్డికి టెండర్లు వచ్చేలా సహకరించటం పద్ధతికాదు’’అని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. ఏపీ చర్యలను అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సార్లు సూచించామని, అయినా ఎలాంటి స్పందనా లేదని చెప్పారు.ఈ మేరకు బుధవారం వివేక్ ఓ పత్రికా ప్రకటనవిడుదల చేశారు.

ఏపీ ప్రాజెక్టులను అడ్డు కోవాలని సీఎంకు లేదు

సంగమేశ్వరం, పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపుపై బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, ఎంపీ బండి సంజయ్ కేంద్ర జల శక్తిమంత్రికి ఫిర్యాదు చేశారని వివేక్ గుర్తుచేశారు. అప్పుడు కేసీఆర్ ఫౌంహౌస్ లో కూర్చుని సెక్రటేరియట్ కూల్చివేత, ప్రాజెక్టుల రీ డిజైన్ తో కమీషన్లు ఎలా తీసుకోవాలో ఆలోచిస్తున్నారని ఆరోపించారు. ఏపీ చర్యలపై అపెక్స్ కౌన్సిల్, పర్యావరణ శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు లేవని, అయినా అవేమీ లేకుండానే పనులు మొదలు పెడుతోందని సంజయ్ త‌న ఫిర్యాదులో పేర్కొన్నారని వివేక్ చెప్పారు. ఏపీ సర్కారు చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవాలని సీఎం కేసీఆర్ కు లేదని ఆరోపించారు. ‘‘ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల పనులను, జగన్ ను అడ్డుకోవాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్ పై ఉంది. కానీ పోతిరెడ్డిపాడు విషయంలో జగన్ తో కేసీఆర్ కుమ్మక్కయ్యారు. జగన్, మెగా కృష్ణారెడ్డి సలహాలతో కేసీఆర్ ముందుకెళ్తున్నరు”అని వివేక్ ఆరోపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం