కోట్లాది మంది భారతీయుల మదిలో మెరిసే 'అమెరికన్ డ్రీమ్' ఇప్పుడు ఒక పీడకలలా మారుతోందా? ఏళ్ల తరబడి కష్టపడి కూటబెట్టిన డబ్బులతో, సముద్రాలు దాటి, సిలికాన్ వ్యాలీలో సామ్రాజ్యాలు నిర్మించిన భారతీయులు.. ఇప్పుడు తమ సొంత దేశానికి తిరిగి వచ్చేద్దాం అనుకుంటున్నారు. లేదంటే మరో దేశానికి వెళ్లిపోవాలని అనుకుంటున్నారట. డాలర్ల కోసం వ్యయప్రయాసలు, దశాబ్దాల నిరీక్షణలు, మారుతున్న రాజకీయ పరిస్థితుల మధ్య విసిగిపోయిన ప్రవాస భారతీయుడు ఇప్పుడు తన మకాం మార్చాలని చూస్తున్నారని 'కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్' 2026 సర్వే రిపోర్ట్ బయటపెట్టింది.
2026 ఫిబ్రవరి నుండి ఏప్రిల్ మధ్య జరిగిన ఈ సర్వే ప్రకారం.. ప్రతి 10 మంది భారతీయ-అమెరికన్లలో 4 అమెరికాను వదిలి వెళ్లిపోవాలని సీరియస్ గా ఆలోచిస్తున్నారని తేలింది. అంటే దాదాపు 40 శాతం మంది అమెరికాలో ఉండటం సురక్షితం కాదని భావిస్తున్నారు. అమెరికా జనాభాలో భారతీయుల వాటా కేవలం 1.5 శాతం మాత్రమే అయినప్పటికీ.. ఆ దేశ పన్నుల ఆదాయంలో ఏకంగా 6 శాతం వీరే కడుతున్నారు. ఒక విధంగా ఈ కేటగిరీ ప్రజలు వెళ్లిపోవటం అమెరికాకు కూడా భారీ దెబ్బనే చెప్పుకోవాలి. గత ఏడాది హెచ్1బీ వీసాల జారీ 25శాతం మేర తగ్గింది. లక్ష డాలర్ల అప్లికేషన్ ఫీజు అమల్లోకి వచ్చిన తర్వాత హెచ్-1బీ వీసాల కోసం కంపెనీల నుంచి డిమాండ్ 87శాతం తగ్గిందట.
ట్రంప్ సెకండ్ టర్మ్ - రాజకీయ విభజన..
అమెరికాను వీడాలనుకునే వారిలో 58 శాతం మంది అక్కడ మారిన రాజకీయ వాతావరణం తమ నిర్ణయానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ 2వ సారి అధికారంలోకి వచ్చాక దేశంలో రాజకీయ విభజన పెరిగిందని 71 శాతం మంది ఇండియన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమెరికా కేవలం అమెరికన్లకే అనే నినాదాలు.. మారుతున్న సామాజిక పరిస్థితులు భారతీయుల్లో తమ ఉనికిపై అనుమానాలను పెంచుతున్నాయి. ఒకప్పుడు డెమోక్రాట్లకు మద్దతుగా నిలిచిన భారతీయులు ఇప్పుడు అయోమయంలో ఉన్నారు.
గ్రీన్ కార్డ్.. ఒక జీవితకాల శిక్ష
భారతీయుల అసహనానికి మరో ప్రధాన కారణం అక్కడి ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలు. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. అది చేతికి రావడానికి దాదాపు 30 నుండి 40 ఏళ్లు పడుతోంది. అమెరికా ఇప్పటికీ 2013-14 నాటి గ్రీన్ కార్డ్ అప్లికేషన్లనే ప్రాసెస్ చేస్తున్నట్లు మే 2026 వీసా బులెటిన్ వెల్లడించింది. అంటే దాదాపు 10 ఏళ్ల కిందట అప్లై చేసినోళ్లకు ఇప్పుడు ప్రాసెస్ చేస్తుంటే ఇప్పుటి వరాకి ఇంకెప్పుడు వస్తాయనే భయాలు వెంటాడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ వెయిటింగ్ 70 ఏళ్లు కూడా ఉండవచ్చని అంచనా. అంటే ఒక వ్యక్తి తన ఉద్యోగ జీవితం మొత్తం గ్రీన్ కార్డ్ కోసమే పోరాడాల్సి వస్తోంది. దీంతో ఇండియన్ ఫ్యామిలీస్ అక్కడ స్థిరపడలేకపోతున్నాయి.
ఆకాశాన్నంటుతున్న ఖర్చులు
అమెరికాలో జీవన వ్యయం ఇప్పుడు సామాన్యుడికి భారంగా మారింది. ఒక బిడ్డను 18 ఏళ్ల వరకు పెంచడానికి సుమారు రూ. 2.50 కోట్లు ఖర్చవుతోందని నివేదికలు చెబుతున్నాయి. దీనికి తోడు హెల్త్‌కేర్, చైల్డ్ కేర్ ఖర్చులు మధ్యతరగతి భారతీయుల నడ్డి విరుస్తున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ వంటి నగరాల్లో అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. అదనంగా, కార్యాలయాల్లో ఎదురయ్యే వివక్ష కూడా వారిని మానసికంగా కృంగదీస్తోంది.
అమెరికాను వదిలేస్తున్న వారు కేవలం భారత్‌కే కాకుండా.. కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి దేశాల వైపు చూస్తున్నారు. అక్కడ పౌరసత్వ నిబంధనలు సరళంగా ఉండటం, పన్నుల భారం తక్కువగా ఉండటం వారిని ఆకర్షిస్తోంది. మొత్తం మీద.. అమెరికా తన ఇమ్మిగ్రేషన్ విధానాలను మార్చుకోకపోతే.. నైపుణ్యం కలిగిన భారతీయులను కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. అమెరికన్ డ్రీమ్ ఇప్పుడు కేవలం ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

