- ఫిన్లాండ్ చదువులు ఆదర్శనీయం
- అక్కడ 98 శాతం సర్కారు స్కూళ్లే
- ర్యాంకింగుల్లేవ్.. పోటీ లేదు.. ఒత్తిడి అసలే లేదు
- 45 నిమిషాల క్లాస్..15 నిమిషాల బ్రేక్
- టీచర్లకు మాస్టర్ డిగ్రీ మస్ట్.. ఒకే టీచర్ ఆరేళ్లు పాఠాలు చెప్తారు
- ఫిన్లాండ్ విద్యావిధానంపై రాష్ట్ర అధికారుల బృందం అధ్యయనం
హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా విధానం కలిగిన దేశంగా పేరుగాంచిన ఫిన్లాండ్‌లో తెలంగాణ విద్యాశాఖ అధికారుల బృందం పర్యటిస్తోంది. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా నేతృత్వంలోని 40 మంది టీం అక్కడ క్షేత్రస్థాయిలో విద్యాసంస్థలను పరిశీలిస్తోంది. అక్కడి బడుల్లో పిల్లలు ఎలా చదువుతున్నారు? టీచర్ల ట్రైనింగ్ ఎలా ఉంది? సిలబస్ ఏంటి? అనే అంశాలను క్షుణ్ణంగా స్టడీ చేస్తోంది. అక్కడ అమలవుతున్న మెరుగైన విధానాలను మన దగ్గర కూడా అమలు చేసే అవకాశాలను ఈ బృందం పరిశీలిస్తోంది.
రాష్ట్ర అధికారుల బృందం అధ్యయనంలో ఫిన్లాండ్ విద్యా విధానానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఫిన్లాండ్ విద్యా వ్యవస్థలో టీచర్లకు అత్యున్నత స్థానం ఉంది. అక్కడ టీచర్ కావాలంటే మాస్టర్ డిగ్రీ తప్పనిసరి. కేవలం చదువే కాదు.. కళలు, సంగీతం, థియేటర్ వంటి అంశాల్లోనూ టీచర్లకు పట్టు ఉంటుంది.
మరో విశేషమేమిటంటే.. ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు అదే విద్యార్థులతో అదే టీచర్ కొనసాగుతారు. దీంతో పిల్లల బలహీనతలు, ప్రతిభ టీచర్‌కు క్షుణ్ణంగా తెలుస్తుంది. పాఠాలు ఎలా చెప్పాలో ప్లాన్ చేసుకునే పూర్తి స్వేచ్ఛ టీచర్లకే ఉంటుంది. 6 ఏళ్ల వయసులో ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ అండ్ కేర్ (ఈసీఈసీ) తప్పనిసరి. తల్లిదండ్రులు కావాలనుకుంటే 6 నెలల వయసు నుండే పిల్లలను డే కేర్‌కు పంపించుకునే అవకాశం ఉంది. ఒకటో తరగతి నుంచి ఉచిత, నిర్బంధ విద్య అందుబాటులో ఉంది. ఒకటో తరగతిలో చేరే ముందు (6 – 7 ఏండ్ల వయసులో) ఒక ఏడాది పాటు ప్రిపరేటరీ క్లాస్ చదవడం తప్పనిసరి ఉంటుంది.
పరీక్షల గోల లేదు.. ర్యాంకుల వేట లేదు
మన దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ ఒకటో తరగతి నుంచే పరీక్షలు, ర్యాంకుల కోసం పిల్లలపై ఒత్తిడి పెంచుతుంటే.. ఫిన్లాండ్‌లో సీన్ రివర్స్. అక్కడ 9వ తరగతి వరకు అసలు వార్షిక పరీక్షలే ఉండవు. కేవలం నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) ద్వారానే పిల్లల స్థాయిని అంచనా వేస్తారు. స్కూళ్లకు ర్యాంకింగ్‌లు ఇచ్చే పద్ధతి అక్కడ లేదు. అన్ని స్కూళ్లలో క్వాలిటీ ఒకేలా ఉంటుంది. అందుకే 98 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లోనే చదువుకుంటారు. అక్కడ ప్రైవేటు స్కూళ్లు 2 శాతం మాత్రమే ఉంటాయి.
మాతృభాషలోనే చదువు
ఫిన్లాండ్ లో విద్యార్థులకు వారి మాతృభాష అయిన ఫిన్నిష్ లేదా స్వీడిష్‌లోనే బోధన సాగుతుంది. క్లాస్ బ్రేక్ బ్యాలెన్స్ కూడా ఇస్తారు. ప్రతి 45 నిమిషాల బోధన తర్వాత ఖచ్చితంగా 15 నిమిషాల విరామం ఇస్తారు. ప్రైమరీ తరగతుల్లో సగటున 20 మంది, హైస్కూల్ స్థాయిలో 25 మంది విద్యార్థులే ఉంటారు. బడుల్లోనే నాణ్యమైన మధ్యాహ్న భోజనం, క్రమం తప్పకుండా దంత పరీక్షలతో కూడిన ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. టీచింగ్ పీరియడ్లు కూడా తక్కువగానే ఉంటాయి. ఒకటో క్లాస్ పిల్లలకు వారానికి 21 పీరియడ్లు మాత్రమే ఉంటాయి. కంప్యూటర్ విద్యను విడిగా కాకుండా అన్ని సబ్జెక్టులతో కలిపే బోధిస్తారు.

