V6 News

సంజు సూపర్ సెంచరీ, అకీల్ హోసేన్ స్పిన్ తుఫాన్.. ముంబైపై CSK సెన్సేషనల్ విక్టరీ

సంజు సూపర్ సెంచరీ, అకీల్ హోసేన్ స్పిన్ తుఫాన్.. ముంబైపై CSK సెన్సేషనల్ విక్టరీ

MI vs CSK: ఐపీఎల్ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ పోరులో 'ఎల్లో ఆర్మీ' గర్జించింది. సంజూ శాంసన్ క్లాస్ సెంచరీకి, అకీల్ హొసైన్ మాస్ బౌలింగ్ తోడవ్వడంతో ముంబై ఇండియన్స్ తన సొంత కోటలోనే ఘోర పరాభవాన్ని చవి చూసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి సంజూ శాంసన్ వెన్నెముకగా నిలిచాడు. ముంబై బౌలర్లను ఫోర్లు, సిక్సర్లతో చెడుగుడు ఆడుకుంటూ అద్భుతమైన సెంచరీ బాదాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 6 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరును బోర్డుపై పెట్టింది. 

విఫలమైన ముంబై బ్యాటింగ్: 
208 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్ (7), డానిష్ మలేవార్ (0), నమన్ ధీర్ (0) ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ కు క్యూ కట్టారు. పరుగుల ఖాతా తెరవకుండానే ఇద్దరు కీలక బ్యాటర్లు అవుట్ అవ్వడం ముంబైని కోలుకోలేని దెబ్బ తీసింది. మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (36), తిలక్ వర్మ (37) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలిసి 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినప్పటికీ, అకీల్ హొసైన్ బౌలింగ్‌లో తిలక్ అవుట్ అవ్వడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ వెంటనే కెప్టెన్ హార్డిక్ పాండ్యా (1), రూథర్‌ఫోర్డ్ (0) నిరాశపరచడంతో ముంబై ఆశలు ఆవిరయ్యాయి.

అకీల్ హోసేన్ పంజా:
చెన్నై బౌలర్లలో అకీల్ హోసేన్ నిప్పులు చెరిగే బంతులతో 4 వికెట్లు పడగొట్టి ముంబై పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా నూర్ అహ్మద్ 2 వికెట్లు తీయగా.. ముకేష్ చౌదరి, జేమీ ఓవర్టన్, అన్షల్ కాంబోజ్ తలో వికెట్ తీసి ముంబైని 104 పరుగులకే కట్టడి చేశారు. ఈ భారీ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో తన ఆధిపత్యాన్ని చాటగా, ముంబై ఇండియన్స్ తమ లోపాలను సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.