అసదుద్దీన్ ఒవైసీ: ఆర్టీసీ కార్మికులకు సలహా.. కేసీఆర్ కు ఓ రిక్వెస్ట్

అసదుద్దీన్ ఒవైసీ: ఆర్టీసీ కార్మికులకు సలహా.. కేసీఆర్ కు ఓ రిక్వెస్ట్

హైదరాబాద్: నెల రోజులుగా సాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఆర్టీసీ విషయంలో ఏర్పడిన సందిగ్ధం త్వరలోనే తొలగిపోతుందని ఆయన అన్నారు.

కాంగ్రెస్, బీజేపీలను నమ్మొద్దు.. ఉద్యోగాల్లో చేరండి

కార్మికులెవరూ ఆత్మ త్యాగాలకు పాల్పడొద్దని, సమ్మెలో కొందరి ప్రాణాలు పోవడం బాధాకరమని చెప్పారు. ప్రభుత్వంతో కూర్చుని మాట్లాడి సమస్యల్ని పరిష్కరించుకోవాలని సూచించారాయన. విధుల్లో చేరేందుకు కేసీఆర్ పెట్టిన ప్రపోజల్ కు ఒప్పుకోవాలని కార్మికులకు సలహా ఇచ్చారు ఒవైసీ. కాంగ్రెస్, బీజేపీ రాజకీయాల కోసం ఆర్టీసీ యూనియన్లను వాడుకుంటున్నాయని, ఆ పార్టీలను నమ్మొద్దని చెప్పారాయన.

చివరి అవకాశంగా కార్మికులు నవంబరు 5 లోపు విధుల్లో చేరొచ్చని సీఎం కేసీఆర్ శనివారం రాత్రి ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది గంటలకే ఒవైసీ హైదరాబాద్ లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రైవేటుకిచ్చినా నిజాం తల్లి గుర్తు చెరపొద్దు

5100 ఆర్టీసీ బస్సు రూట్లను ప్రైవేటు పరం చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపైనా ఒవైసీ స్పందించారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసినా నిజాం తల్లి గుర్తును మాత్రం చెరపొద్దంటూ విజ్ఞప్తి చేశారాయన. ఆర్టీసీ బస్సుల నంబరు ప్లేట్లపై ఉన్న ‘Z’  అక్షరాన్ని అలానే కొనసాగించాలని కోరారు. హైదరాబాద్ ను పాలించిన చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తల్లి జహ్రా బేగం పేరు మీద ఆ ‘Z’ అక్షరం ఉందని చెప్పారాయన. ఇది హైదరాబాద్ చరిత్రలో భాగమని, దాని అలానే ఉంచాలని కోరారు అసదుద్దీన్ ఒవైసీ.

ఇదీ నాటి చరిత్ర

హైదరాబాద్ ను పాలిస్తున్న నిజాం నవాబులు 1879లో నిజాం స్టేట్ రైల్వే (ఎన్ఎస్ఆర్) పేరుతో సొంత రైల్వే వ్యవస్థను ప్రారంభించారు. 1932 జూన్ లో రోడ్డు రవాణా వ్యవస్థను కూడా స్టార్ట్ చేశారు. హైదరాబాద్ స్టేట్ లో 166 మంది ఉద్యోగులు, 27 బస్సులతో ప్రజా ట్రాన్స్ పోర్ట్ అందుబాటులోకి వచ్చింది.  ఆ తర్వాత ఈ రెండింటినీ కలిపి నిజామ్స్ స్టేట్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ డిపార్టుమెంట్ గా ఏర్పాటు చేశారు. నాడు నిజాం పాలనలో నడిచిన బస్సుల రిజిస్ట్రేషన్ నంబరు లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తల్లి జహ్రా బేగం పేరుకు గుర్తుగా ‘Z’  అక్షరాన్ని పెట్టారు.

స్వతంత్ర భారత తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన ఆపరేషన్ పోలో తో 1948 సెప్టెంబరు 17న హైదరాబాద్ స్టేట్ ఇండియాలో విలీనమైంది. ఈ సందర్భంగా నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్ తో భారత ప్రభుత్వానికి ఓ ఒప్పందం జరిగింది. అందులో భాగంగా బస్సుల నంబరు ప్లేట్ పై తన తల్లి సెంటిమెంట్ ను గౌరవించి ‘Z’ అక్షరాన్ని కొనసాగించాలని కోరారు. దీనికి భారత ప్రభుత్వం అంగీకరించింది. నాటి నుంచి.. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, ఇప్పుడు విభజన తర్వాత నవ్యాంధ్రలోనూ, ఇటు తెలంగాణలోనూ అన్ని ప్రభుత్వం బస్సుల నంబరు ప్లేట్లపై ‘Z’ ను కొనసాగిస్తున్నారు.