దేశవ్యాప్తంగా 30 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు..

దేశవ్యాప్తంగా 30 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు..

యాప్ ఆధారిత మోసపూరిత పెట్టుబడి పథకానికి సంబంధించిన కేసు విచారణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. మే 1న దేశంలోని 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో  కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. 

ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకతోపాటు యూటీలలోని దాదాపు 30 ప్రాంతాల్లో దాడులు చేసింది. ఈ సోదాల్లో  మొబైల్ ఫోన్‌లు, కంప్యూటర్ హార్డ్ డ్రైవ్‌లు, SIM కార్డ్‌లు, ATM/డెబిట్ కార్డ్‌లు, ఇమెయిల్ ఖాతాలు, వివిధ నేరారోపణ పత్రాలతో సహా ముఖ్యమైన డిజిటల్ సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నాయి.

హెచ్‌పిజెడ్ టోకెన్ అపూ యాప్‌ మోసపూరిత పెట్టుబడి పథకంలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై రెండు ప్రైవేట్ కంపెనీలతో పాటు వాటి డైరెక్టర్లపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ పథకంలో ఉనికిలో లేని క్రిప్టో-కరెన్సీ మైనింగ్ మెషిన్ రెంటల్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు ప్రజలను తప్పుదారి పట్టించారని ఆరోపణలు రావడంతో సీబీఐ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. 

నిందితులకు సంబంధించిన దాదాపు 150 బ్యాంకు ఖాతాలను.. ఇన్వెస్టర్ల నుంచి నిధులు సేకరించేందుకు వినియోగించినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మురం చేసింది.