కూరల్లో ఏ కూర మేలయా అంటే.... 'ఆకుకూర' అంటున్నారు వైద్యులు. ప్రకృతి ఇచ్చిన వరం ఆకుకూర. శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లు, ప్రోటీన్లను అందిస్తుంది. అందుకే రోజు వాటిని తినే వాళ్ల జీవనశైలినే మార్చే సత్తా ఆకుకూరలకు ఉంది. ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండా తినే ఆహారాన్ని రుచికరంగా చేస్తాయి. అంతేకాదు..... ఈ ఆకుకూరలు కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఒక అధ్యయనం ద్వారా తెలిపింది.
పాలకూర : ఇందులో విటమిన్-ఎ, క్యాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలకు గట్టిదనాన్ని ఇస్తుంది.
చుక్కకూర: దీంట్లో విటమిన్-సి, మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
తోటకూరు : ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి, ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనతను నివారిస్తుంది. రక్తకణాల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
గోంగూర : విటమిన్-ఎ, విటమిన్-బి1, బి2, 09, విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడం, హై బీపీ, గుండె, కంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి..
మెంతికూర: ఇందులో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అధిక బరువు నివారణకు, గుండె, కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మెంతికూర.
బచ్చలికూర: వీటిలో విటమిన్-ఎ, విటమిన్ -సి, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. కొత్త రక్షకణాలు తయారీకి ఉపయోగపడతాయి. రక్తహీనతను నివారించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
పొన్నగంటి కూర: విటమిన్-ఎ, క్యాల్షియం, ఐరన్, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఆకుకూరలో.. ఇది శరీరంలో వేడిని తగ్గిస్తుంది.
మునగాకు: ఇందులో విటమిన్-సి, విటమిన్-బి3, క్యాల్షియం, పాస్ఫరస్, ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనతను నివారించి ఎముకలకు బలాన్నిస్తుంది.
కొత్తిమీర: యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ - సి.. ఈ కొత్తిమీరలో ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యవంతమైన కణాల కోసం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వృద్ధాప్య లక్షణాలను నివారిస్తుంది.
కరివేపాకు: వీటిలో విటమిన్-ఎ, విటమిన్-బి, విటమిన్-ఇ ఎక్కువగా ఉంటాయి. ఈ కరివేపాకు జుట్టు సంరక్షణకు, రక్తహీనత తగ్గించడానికి, జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది.
పుదీనా: ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం, పాస్పరస్, ఐరన్, విటమిన్-సి ఎక్కువగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో వేడిని తగ్గిస్తుంది.
లివర్ కొవ్వును కరిగిస్తుంది:
అధిక బరువే ఈ ఫ్యాటీ లివరు ముఖ్య కారణం. రోజూ వ్యాయామం చేయని వాళ్లలో కూడా దీని తీవ్రత కనిపిస్తుంది. ఫ్యాటీ లివర్ అంటే... కాలేయం చుట్టూ కొవ్వు పేరుకోవడం. ఆకుకూరల్లో కొవ్వు పదార్థాలు ఉండవు. వీటిని తినడం వల్ల పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ఏ వయసు వాళైనా రోజుకు కనీసం 100 గ్రాముల ఆకుకూరలను మధ్యాహ్నం లేదా రాత్రిపూట భోజనంలో తీసుకోవాలి. కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు తినొద్దు. ఒక్క మెంతికూర తీసుకోవచ్చు. శీతాకాలంలో ఆకుకూరలు తినడం ఎంతో ఆరోగ్యకరం. అయితే వాటిని వండుకునే టప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని ఇసుక, పురుగులు లేకుండా శుభ్రంగా కడగాలి. వేపుడులా కాకుండా పప్పులో, కూరలో వీటిని వేసుకొని తింటే మంచిది.
కాలేయానికి వచ్చే 'ఫ్యాటీ లివర్' అనే వ్యాధికి ఈ ఆకు కూరలు చెక్ పెడతాయి. ఈ వ్యాధి అధిక బరువు, మద్యపానం వల్ల వస్తుంది. ప్రపంచ జనాభాలో 25 శాతం మంది ఈ స్టియటోసితో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అలాగేమారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు కూడా కాలేయ వ్యాధులకు కారణమవుతున్నాయి.
ఆకుకూరలతో చెక్
రోజూ మనం తీసుకునే ఆహారంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. వాటిలో అత్యంత ఎక్కువ పోషకాలు కూరల్లోనే ఉంటాయి. అంతేకాదు ఆహారాన్ని రుచికరంగా చేసే ప్రత్యేక లక్షణం వీటికి ఉంటుంది. ప్రతిరోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను చేర్చితే.. కాలేయం పదిలంగా ఉంటుంది. ఈ విషయంపై చేసిన ఒక అధ్యయనం పీఎన్ఎస్ అనే జర్నల్ లో వచ్చింది. ఆకుపచ్చ కూరలు ఎంత ఎక్కువగా తీసుకుంటే... అవి కాలేయానికి సంబంధించిన వ్యాధులు రాకుండా చేస్తాయని అందులో వెల్లడైంది. ఒక్క కాలేయానికే కాకుండా వీటితో ఎన్నో ఆరోగ్య లాభాలున్నాయి. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయి.
ఆకుకూరలు ఎలా వండొచ్చు
*ముందుగా ఆకుకూరలను కడిగి తర్వాత కోయాలి. కోసిన తర్వాత నీళ్లలోవేస్తే వాటిలో ఉండే పోషకాలు తగ్గిపోతాయి.
* వీటిని తక్కువ నూనెతో వండాలి. వీటిలో నూనెలో కరిగే విటమిన్ కె ఉండడం వల్ల.. ఎక్కువ నూనె వాడొద్దు.
* నీళ్లు పోయకుండా వాటిలో ఊరే నీళ్లతోనే ఆకులను ఉడికించాలి.
* ఆకుకూరలను పప్పుతో కలిపి వండటం వల్ల పోష కపదార్థాల సమతుల్యత లభిస్తుంది.
* రెండు మూడు రకాల ఆకు కూరలు కలిపి వండితే... అన్నిరకాల ఖనిజ లవణాలు, విటమిన్లు అందుతాయి.
