- చిట్టగాంగ్‌లో ఇండియన్ వీసా ఆపరేషన్లు క్లోజ్
- భారత్‌పై బంగ్లా మీడియా దుష్ప్రచారం: కేంద్రం
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో అల్లరిమూక చేతిలో బలైపోయిన హిందూ యువకుడు దీపూ చంద్ర దాస్(25) ఇస్లాంకు వ్యతిరేకంగా కామెంట్లు చేసినట్టు ఎలాంటి ఆధారాలులేవని ఆ దేశ ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ కమాండర్ ఒకరు వెల్లడించారు. మైమెన్సింగ్ సిటీలోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న దీపూ చంద్ర దాస్.. మహ్మద్ ప్రవక్తను దూషించాడంటూ గురువారం అల్లరిమూక కొట్టి చంపి, తగులబెట్టిన ఘటన సంచలనం రేపింది.
దీపూ చంద్ర ఎలాంటి తప్పు చేయలేదని, అతడి తోటి ముస్లిం కార్మికుడు కావాలనే అతడిని బలి చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఆర్ఏబీ కమాండర్ మహమ్మద్ షంషుజమాన్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. దీపూ చంద్ర ఫేస్ బుక్‌లో గానీ, నేరుగా గానీ ఇస్లాంకు వ్యతిరేకంగా కామెంట్లు చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేవన్నారు.
తోటి కార్మికులు, స్థానికులు కూడా అతడు ప్రవక్తను దూషించాడని ఎక్కడా చెప్పలేదన్నారు. కాగా, యూత్ లీడర్ షరీఫ్ఉస్మాన్ హాదీ హత్య నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో గురువారం రాత్రి అల్లరిమూకలు రెచ్చిపోయాయి. ఈ సందర్భంగా దీపూ చంద్ర దారుణ హత్యకు సంబంధించిన వీడియోలు సంచలనం సృష్టించాయి. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారని, మరో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారని శనివారం తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్ ప్రకటించారు.
బంగబంధు హాల్‌కు హాదీ పేరు
ఢాకా వర్సిటీలోని బంగ్లాదేశ్ జాతిపిత బంగబంధు షేక్ ముజిబుర్ రహమాన్ హాల్‌కు ఆయన పేరును శనివారం అధికారులు తొలగించారు. ఇటీవల హత్యకు గురైన యూత్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హాదీ పేరుతో బోర్డును ఏర్పాటు చేశారు. ముజిబుర్ రహమాన్ కుమార్తె షేక్ హసీనాను గతేడాది గద్దె దింపడంలో హాదీ కీలక పాత్ర పోషించారు. హసీనా భారత్‌కు పారిపోయి వచ్చిన తర్వాత అక్కడి ముజిబుర్ రహమాన్ ఇండ్లు, స్మారకాలపై దాడులు కొనసాగాయి.
ఇండియన్ వీసా సెంటర్ క్లోజ్
బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో చిట్టగాంగ్ లోని ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్ కార్యకలాపాలను నిరవధికంగా రద్దు చేశారు. చిట్టగాంగ్ లోని అసిస్టెంట్ హైకమిషన్ ఆఫ్ ఇండియా ఆఫీసుపై దాడి నేపథ్యంలో భద్రతా కారణాల వల్ల ఆపరేషన్లను రద్దు చేశామని, భద్రతపై సమీక్షించిన తర్వాత తదుపరి ప్రకటన వరకూ వీసా అప్లికేషన్ల పరిశీలన ఉండబోదని ఇండియన్ ఆఫీసర్లు ఆదివారం ప్రకటించారు.
అవన్నీ తప్పుడు కథనాలు..
బంగ్లాదేశ్ లో దీపూ చంద్ర దాస్ హత్యకు నిరసనగా ఢిల్లీలోని బంగ్లా హైకమిషన్ వద్ద శనివారం జరిగిన నిరసనలపై బంగ్లా మీడియా దుష్ప్రచారం చేసిందని భారత విదేశాంగ శాఖ ఖండించింది. బంగ్లా హైకమిషన్ ముందు 20 నుంచి 25 మంది యువత గుమిగూడి నిరసనలు తెలిపారని, వెంటనే పోలీసులు వారిని చెదరగొట్టారని తెలిపింది.
వాస్తవం ఇలా ఉండగా.. బంగ్లా మీడియా మాత్రం బంగ్లా హైకమిషన్ వద్ద ఫెన్సింగ్ ను దాటుకుని నిరసనకారులు దూసుకెళ్లారని, భద్రతా ఉల్లంఘన జరిగిందంటూ తప్పుడు కథనాలు ప్రచురించిందని స్పష్టం చేసింది.
