బస్సుల్లో, ఆటోల్లో ఇక డబుల్ మీనింగ్ పాటలపై బ్యాన్ : బీహార్ ప్రభుత్వ సంచలన నిర్ణయం!

బస్సుల్లో, ఆటోల్లో ఇక డబుల్ మీనింగ్ పాటలపై బ్యాన్ : బీహార్ ప్రభుత్వ సంచలన నిర్ణయం!

పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అంటే బస్సులు, ఆటోలు, రైళ్లలో అసభ్యకరమైన, డబుల్ మీనింగ్ పాటలు ప్లే చేయడాన్ని బీహార్ ప్రభుత్వం నిషేధించింది. ప్రయాణికుల గౌరవాన్ని, ముఖ్యంగా మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా బస్సుల్లో, ఆటోల్లో వచ్చే అసభ్యకర పాటల వల్ల మహిళలు, విద్యార్థినులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆ పాటల  కించపరిచేలా ఉంటున్నా, ఎం చేయలేక మౌనంగా భరిస్తున్నారు.

బస్సు అనేది ప్రజలు అందరు ప్రయాణించే చోటు. అక్కడ కొందరికి వినోదంగా అనిపించే పాటలు, మరికొందరికి భయాందోళన లేదా అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. సొంత కార్లు లేదా వాహనాలు ఉన్నవారు ఎలాగైనా ప్రయాణించవచ్చు. కానీ సామాన్య గృహిణులు, ఆఫీసులకు వెళ్లే మహిళలు, విద్యార్థులు కచ్చితంగా బస్సులపైనే ఆధారపడాలి. అలాంటి చోట గౌరవప్రదమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత.

అసభ్యత లేదా డబుల్ మీనింగ్‌ పాటలని కచ్చితంగా వర్ణించడం కష్టం. ఏది పాట.. ఏది అశ్లీలం ? అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది దీనిని వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం అని వాదిస్తున్నప్పటికీ, వినోదం కంటే వ్యక్తి గౌరవానికే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

 ఈ రూల్‌ని ఉన్నత స్థాయిలో ఎలా అమలు చేస్తారు ? డ్రైవర్లు, కండక్టర్లు దీనిని పాటిస్తారా ? అధికారులు దీనిని ఎలా పర్యవేక్షిస్తారు? అన్నది ఇప్పుడున్న అతిపెద్ద చర్చనీయాంశం. వినోదం అనేది ఒకరి ఇష్టం కావచ్చు.. కానీ గౌరవంగా బతకడం అనేది ప్రతి ఒక్కరి హక్కు. ఈ సూత్రం ఆధారంగానే ప్రభుత్వం ఈ నిషేధాన్ని తీసుకొచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో మర్యాదపూర్వక వాతావరణం ఉండాలని చాల మంది ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.