అంతరిక్షంలో మహిళలు పిల్లలకు జన్మనివ్వడం సాధ్యమేనా ? కొత్త పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే ?

 అంతరిక్షంలో మహిళలు పిల్లలకు జన్మనివ్వడం సాధ్యమేనా ? కొత్త పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే ?

ఒకప్పుడు అంతరిక్షం అంటే కేవలం పరిశోధనలకే పరిమితం. కానీ ఇప్పుడు సామాన్యులు కూడా అంతరిక్ష ప్రయాణాలు చేసే రోజులు వచ్చేశాయి. దింతో మనుషులు భూమి కాకుండా వేరే గ్రహం మీద నివసించగలరా ? మహిళలు అక్కడ ప్రసవించగలరా? అనే ప్రశ్నలపై శాస్త్రవేత్తలు లోతైన అధ్యయనాలు చేస్తున్నారు. అయితే అంతరిక్ష వాతావరణం మానవ శరీరానికి, ముఖ్యంగా సంతానోత్పత్తికి అంత అనుకూలం కాదు. దీనికి కారణం....  

 భూమి మీద ఉన్నట్లుగా అక్కడ గురుత్వాకర్షణ లేకపోవడం. గురుత్వాకర్షణ లేకుంటే శరీరంలోని ద్రవాలు, ఎముకల నిర్మాణంపై ప్రభావం చూపుతుంది. అంతరిక్షంలో ఉండే ప్రమాదకరమైన కిరణాలు (రేడియేషన్) కణాలను దెబ్బతీస్తాయి. ఇది సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించడమే కాకుండా క్యాన్సర్ వచ్చే ముప్పును పెంచుతుంది.  భూమిపై ఉన్నట్లుగా అక్కడ పగలు, రాత్రి ఉండవు కాబట్టి మనుషుల నిద్ర, హార్మోన్ల విడుదలపై ప్రభావం పడుతుంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న IVF (సంతాన సాఫల్య పరీక్షలు), పిండాలను గడ్డకట్టించే (Cryopreservation) పద్ధతులు అంతరిక్షంలో కూడా పనిచేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అంతరిక్ష నౌకలోనే పిండాలను అభివృద్ధి చేయడం వంటివి భవిష్యత్తులో సాధ్యమేనని ఎంబ్రియోలజిస్ట్ గైల్స్ పామర్ చెబుతున్నారు.

ప్రస్తుతానికి గర్భిణీ స్త్రీలు అంతరిక్షంలోకి అనర్హులు. వ్యోమగాములు యాత్రలో ఉన్నప్పుడు పీరియడ్స్ రాకుండా మందులు వాడుతుంటారు. అయితే, రాబోయే రోజుల్లో అంగారక గ్రహం మార్స్ వంటి యాత్రలు మొదలైతే, ప్రణాళిక లేని గర్భధారణ జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

కేవలం సాంకేతిక ఉంటే సరిపోదు, కొన్ని ప్రశ్నలు, సవాళ్లు కూడా ఉన్నాయి.  అంతరిక్షంలో పుట్టే పిల్లల ఆరోగ్యం ఎలా ఉంటుంది, అక్కడ పుట్టే బిడ్డ పౌరసత్వం ఏ దేశానికి చెందుతుంది,  అంతరిక్ష యాత్ర వల్ల పిల్లలు పుట్టకపోవడం సంభవిస్తే బాధ్యత ఎవరిది... అంతరిక్షంలో ప్రసవం అనేది ప్రస్తుతానికి ఒక ఊహలా ఉన్నా, సైన్స్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే, సరైన చట్టాలు, రక్షణ పద్ధతులు లేకుండా భూమి కాకుండా ఇతర గ్రహాలపై పునరుత్పత్తికి ప్రయత్నించడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.