Samantha: హద్దులు దాటిన ఫ్యానిజం.. హైదరాబాద్‌లో సమంతకు చేదు అనుభవం!

Samantha: హద్దులు దాటిన ఫ్యానిజం.. హైదరాబాద్‌లో సమంతకు చేదు అనుభవం!

సినీ గ్లామర్ ప్రపంచంలో స్టార్‌డమ్ ఎంత అందంగా ఉంటుందో..  ఒక్కోసారి అది అంతే ఇబ్బందికరంగా మారుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కొన్ని సంఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కేవలం కొద్దిరోజుల వ్యవధిలోనే ఇద్దరు స్టార్ హీరోయిన్లు అభిమానుల తాకిడికి ఉక్కిరిబిక్కిరి కావడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

సమంతకు చేదు అనుభవం..

లేటెస్ట్ గా హైదరాబాద్‌లో ఒక వస్త్ర దుకాణ ప్రారంభోత్సవానికి వెళ్లిన సమంతకు చేదు అనుభవం ఎదురైంది. సాంప్రదాయ కంచి పట్టుచీరలో ఎంతో హుందాగా ఈవెంట్‌కు హాజరైన ఆమెను చూసేందుకు అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమం ముగించుకుని ఆమె తిరిగి కారు వైపు వెళ్తుండగా పరిస్థితి అదుపు తప్పింది. సెక్యూరిటీ సిబ్బంది ఎంత ప్రయత్నించినప్పటికీ, జనం ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టారు. ఫోటోల కోసం, సెల్ఫీల కోసం జనం ఎగబడటంతో సమంత కనీసం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. అంతటి గందరగోళంలో కూడా ఆమె చిరునవ్వు చెదరకుండా నిబ్బరంగా ఉండటం అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో, సెలబ్రిటీల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

నిధి అగర్వాల్ ఘటన

సమంత కంటే ముందే, కుకట్‌పల్లిలోని లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు సైతం ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి నటిస్తున్న 'ది రాజా సాబ్' సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చిన ఆమెను అభిమానులు ముట్టడించారు. కొందరు ఆకతాయిలు ఆమె వ్యక్తిగత ప్రైవసీని భంగం కలిగిస్తూ ప్రవర్తించడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, అనుమతి లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మాల్ మేనేజ్‌మెంట్ , నిర్వాహకులపై సుమోటోగా కేసు నమోదు చేశారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా సెలబ్రిటీలను ఆహ్వానించడంపై కేపీహెచ్‌బీ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ALSO READ : ఘనంగా "నవాబుపేట దేవర" డాక్యుమెంటరీ ప్రీమియర్ షో

మారిపోతున్న అభిమానం..

ఒకప్పుడు అభిమానం అంటే దూరం నుంచి చూసినా మురిసిపోయేవారు. కానీ ఇప్పుడు అది 'మొబైల్ సెల్ఫీ' మోజులో పడి భౌతిక దాడి చేసే స్థాయికి చేరుతోంది. ముఖ్యంగా చదువుకున్న యువత కూడా ఇలా ప్రవర్తించడం పట్ల నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తారలకు కూడా వ్యక్తిగత ప్రైవసీ ఉంటుంది. అభిమానం హద్దులు దాటితే అది వేధింపు అవుతుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సెలబ్రిటీలు వస్తున్నారంటే పబ్లిసిటీ కోసం ఆరాటపడే నిర్వాహకులు, ఇకపై కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అభిమానం ఉండాలి కానీ, అది అవతలి వ్యక్తికి అసౌకర్యాన్ని కలిగించకూడదన్నదే నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.