క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "మిరాకిల్" ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రమేష్ ఎగ్గిడి, శ్రీకాంత్ మొగదాసు, చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రభాస్ నిమ్మల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, మూడో షెడ్యూల్‌ను హైదరాబాద్ సమీపంలోని కొండమడుగు గ్రామంలో విజయవంతంగా ముగించుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో చిత్ర యూనిట్ సినిమా విశేషాలను పంచుకుంటూ.. ఇదొక సరికొత్త ప్రయోగమని చెప్పారు.
హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడుతూ తన కెరీర్‌లో 'కుమారి 21ఎఫ్', 'ఓదెల రైల్వే స్టేషన్' వంటి విజయాలు ఉన్నప్పటికీ.. మిరాకిల్ అత్యంత గుర్తుండిపోయే చిత్రమవుతుందని అన్నారు. దర్శకుడు ప్రభాస్ నిమ్మల ఈ కథను మలిచిన తీరు అద్భుతమని, నటిగా ఇది తనకు బెస్ట్ ఫిల్మ్ అని కొనియాడారు. సీనియర్ హీరో శ్రీరామ్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ వైవిధ్యమైన సినిమాలను ఆదరిస్తారని, ఈ చిత్రంతో దర్శకుడు ప్రభాస్ నిమ్మల పేరు మారుమ్రోగుతుందని ప్రశంసించారు. అలాగే ఈ సినిమాతో రణధీర్ బీసు హీరోగా, నరేష్ నాయుడు విలన్‌గా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
దర్శకుడు ప్రభాస్ నిమ్మల ఈ చిత్రంపై తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, భారతీయ తెరపై ఇప్పటివరకు ఆవిష్కారం కాని ఒక వినూత్న కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలిపారు. కొండమడుగు గ్రామ ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని, సినిమా విజయం సాధించిన తర్వాత ఖచ్చితంగా అక్కడే సక్సెస్ మీట్ నిర్వహిస్తామని చెప్పారు. సురేందర్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని, నటీనటులందరూ తమ పాత్రల్లో జీవించారని చెప్పారు.
ప్రస్తుతానికి 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, త్వరలోనే చివరి షెడ్యూల్‌ను ప్రారంభించనుంది. సీనియర్ నటులు సురేష్, ఆమని, జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి కథ, మాటలు, సంగీతం, దర్శకత్వం బాధ్యతలను ప్రభాస్ నిమ్మల స్వయంగా నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చి ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలని సినీ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
