ఎయిర్ ఇండియా విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.. సాంకేతిక లోపంతో టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండ్ అయ్యింది. శుక్రవారం (డిసెంబర్ 22) ఉదయం ఢిల్లీ నుంచి ముంబై వెళ్లున్న ఫ్లైట్ నెంAI887 విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కుడి ఇంజిన్ లో టెక్నికల్ సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్లు విమానాని వెనక్కితిప్పి అత్యవసరంగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు.
ప్రయాణికులకు కలిగిన అసౌకర్యంపై ఎయిర్ ఇండియా క్షమాపణలు చెప్పింది. ప్రయాణికులు తిరిగి వారి గమ్యస్థానాలకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు తాము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా సంస్థ తెలిపింది.
గత వారం విజయవాడనుంచి విశాఖ పట్నం వెళ్తున్న మరో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ లో కూడా సాంకేతిక లోపం కారణంగా అత్యవసర ల్యాండింగ్ అయింది. టేకాఫ్ కు ముందు గన్నవరం ఎయిర్ పోర్టులో నే నిలిపివేశారు. ఈ విమానంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, ఏపీ వ్యవసాయ మంత్రి కె. అచ్చెన్నాయుడు, సీనియర్ వైఎస్ఆర్సీపీ నేత బి. సత్యనారాయణ ఉన్నారు.
