T20 World Cup: T20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 మ్యాచ్‌లో పల్లెకెలెలో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. 51 పరుగుల తేడాతో సూపర్–8లో తొలి విజయాన్ని హ్యారీ బ్రూక్ సేన నమోదు చేసుకుంది. ఇంగ్లీష్ జట్టు ఇచ్చిన 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన ఆతిథ్య శ్రీలంక జట్టుకు విల్ జాక్స్ గట్టి షాక్ ఇచ్చిడు. పవర్ ప్లే ముగియక ముందే ముగ్గురు లంక బ్యాటర్లను ఔట్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
శ్రీలంక బ్యాటర్లలో ఓపెనర్ పాతుమ్ నిస్సాంక గత మ్యాచ్ లో అద్భుతంగా ఆడి హాఫ్ సెంచరీ చేయగా, ఈ మ్యాచ్ లో నిస్సాంక (9) దారుణంగా నిరాశపరిచాడు. అతడితో పాటు తుది జట్టులోకి వచ్చిన కమిల్ మిషార (6), కుసల్ మెండిస్ (4), పవన్ రాత్నాయక్ (0), దుషన్ హేమంత (5), దుష్మంత చమీర (6) సింగిల్ డిజిట్స్ కే అవుట్ కాగా.. దునిత్ వెల్లలాగే (10), కమిందు మెండిస్ (13) మాత్రమే డబుల్ డిజిట్ పరుగులు చేశారు.
లంక కెప్టెన్ దాసున్ షనక మాత్రం ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. చివరి వరకు ఓటమిని అంగీకరించకుండా.. శ్రీలంక గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాడు షనక. కానీ ఆదిల్ రషీద్ బౌలింగ్ లో ఆడిన ఓ భారీ షాట్ కి బాల్ వెళ్లి టామ్ బాంటన్ చేతిలో పడటంతో శ్రీలంక కెప్టెన్ అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో విల్ జాక్స్ కీలకమైన 3 వికెట్లను తీసుకుని లంక ఓటమికి మార్గం సుగమం చేయగా, దూకుడుగా బౌలింగ్ చేసిన జోఫ్రా అర్చర్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. జెమ్మీ ఓవర్టిన్ ఒక వికెట్ తీసుకున్నారు.
