Varalaxmi Sarathkumar: ఆయన వల్లే నాకు సెకండ్ లైఫ్.. వేదికపై ఏడ్చేసిన వరలక్ష్మి శరత్‌కుమార్.

Varalaxmi Sarathkumar: ఆయన వల్లే నాకు సెకండ్ లైఫ్.. వేదికపై ఏడ్చేసిన వరలక్ష్మి శరత్‌కుమార్.

సినీ ఇండస్ట్రీలో వారసుల రాక సులువే అయినా, నిలదొక్కుకోవడం మాత్రం వారి సొంత ప్రతిభపైనే ఆధారపడి ఉంటుంది. కోలీవుడ్ దిగ్గజ నటుడు శరత్‌కుమార్ కుమార్తెగా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి శరత్‌కుమార్.. గ్లామర్ పాత్రలకే కాకుండా ఒక పవర్‌హౌస్ పెర్ఫార్మర్‌గా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు ఆమె నటిగానే కాకుండా దర్శకురాలిగానూ మెగాఫోన్ పట్టి తన టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు..

కన్నీళ్లు పెట్టుకున్న వరలక్ష్మి..

వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సరస్వతి’ (Saraswathi). హై కాన్సెప్ట్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో వరలక్ష్మీతో పాటు ప్రకాష్ రాజ్, ప్రియమణి  కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ రోజు ( ఫిబ్రవరి 21న ) ఈమూవీ ట్రైలర్ ను డైరెక్టర్ మలినేని గోపిచంద్ చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా  వేదికపై వరలక్ష్మి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. దర్శకుడు గోపీచంద్ మలినేనిని చూసి ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. గోపీ సర్ కేవలం దర్శకుడు మాత్రమే కాదు.. నా స్నేహితుడు, మెంటర్. ఒక దశలో అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న నాకు 'క్రాక్' సినిమాతో తెలుగులో సెకండ్ లైఫ్ ఇచ్చారు. నాపై నమ్మకం ఉంచి 'జయమ్మ' పాత్రను ఇచ్చిన ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అని ఎమోషనల్ అయ్యారు.

 

'క్రాక్' తో మలుపు.. 

'పొడా పొడి' సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన వరలక్ష్మికి ఆరంభంలో ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ దక్కలేదు. కానీ, విశాల్ నటించిన 'పందెంకోడి 2' ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. అయితే, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆమెను పాతుకుపోయేలా చేసింది మాత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన 'క్రాక్'. అందులో 'జయమ్మ'గా ఆమె చూపిన విలనిజం, బాడీ లాంగ్వేజ్ కు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలను అందుకుంది. ఆ తర్వాత 'వీరసింహారెడ్డి'లో భానుమతిగా, 'హనుమాన్'లో అంజమ్మగా తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు.

దర్శకురాలిగా కొత్త ప్రయాణం 

ఈ ‘సరస్వతి’  చిత్రంలో సామాజిక అంశాలతో పాటు మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం.  సినీ పరిశ్రమలో మహిళలు నిలదొక్కుకోవడం కష్టం.. అందుకే ఒకరికొకరు తోడుగా ఉండాలి. మహిళలు ఎదిగేందుకు సహకరించాలని వరలక్ష్మీ శరత్ కుమార్ కోరారు. మార్చి 6న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.  నటిగా గ్లామర్ రూల్స్‌ను బ్రేక్ చేసిన వరలక్ష్మి, ఇప్పుడు దర్శకురాలిగా ఎలాంటి మ్యాజిక్ చేస్తారో అని టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

►ALSO READ | Aishwarya Rajesh: నల్లగా ఉన్నావన్నారు.. హీరోయిన్ మెటీరియల్ కాదన్నారు.. ఐశ్వర్య రాజేష్ ఎమోషనల్ !