రెండేండ్లలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భూసేకరణ, పనులకు అవసరమైన నిధులను సమకూరుస్తామని చెప్పారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలోని దేవాదుల ప్రాజెక్టును పరిశీలించారు సీఎం.
ఈ సందర్భంగా ప్రాజెక్టు పురోగతిని అధికారులతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి. ‘ తెలంగాణ ఏర్పడినపుడు నీళ్లు,నిధులు పుష్కలంగా ఉన్నాయి. 967టీఎంసీలు వినియోగంలోకి తెచ్చుకోవాల్సింది. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే లక్ష కోట్లు ఖర్చు పెట్టారు. బీఆర్ఎస్ మిగతా ప్రాజెక్టులను పట్టించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టులు కొనసాగుతూనే ఉన్నాయి. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే రాష్ట్రానికి మేలు జరిగేది.
కాళేశ్వరం నుంచి చుక్క నీరు ఎత్తిపోయకుండానే రికార్డ్ వరి పంట పండింది . భూసేకరణకు ఇప్పుడు కూడా నిధులు వెతుక్కోవాల్సి వస్తోంది. రూ. 5 వేల కోట్లతో మొదలు పెట్టిన దేవాదుల ప్రాజెక్టు అంచనా వ్యయం ఇపుడు రూ.18,500 కోట్లకు పెరిగింది.గోదావరి పరివాహక ప్రాజెక్టులన్నింటిపై సమీక్ష చేస్తాం, గోదావరి నుంచి ఎవరికీ చుక్క నీరు ఇవ్వం, కృష్ణా,గోదావరి నీటి వాటాల విషయంలో పోరాటం ఆగదు. కాళేశ్వరం గొప్ప అనుకుంటే భ్రమే అని తేలిపోయింది. కృష్ణా జలాల వివాదంపై అసెంబ్లీలో క్లారిటీ చర్చించాం. గోదావరి జలాల వివాదంపై అసెంబ్లీలో చర్చిద్దాం. చర్చ జరగకుండా ఏ సమస్య పరిష్కారం కాదు.
బీఆర్ఎస్ చౌకబారు ఆరోపణల్లో లాభం లేదు. బీఆర్ఎస్ కు మంచి ప్రతిపక్షంగా చేసే అవకాశం ఉంది. పక్క రాష్ట్రంతో కూర్చొని మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకుంటాం .బీఆర్ఎస్ ది పదేండ్ల అనుభవం..మాది రెండేండ్ల అనుభవం. మేం ఇంకా మెరుగ్గా పనిచేయాలంటే మీ సూచనలు ఇవ్వండి. బీఆర్ఎస్ నేతలు ఇంకో పదేండ్లు ఆరోగ్యంగా ఉండాలి.అందుకు ప్రవచనాలు వినాలి. ఎంపీ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు ప్రజల తీర్పు చూసైనా బీఆర్ఎస్ తీరు మారడం లేదు’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
