- అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్న అధికారులు
- 2024లో జీహెచ్ఎంసీ, హెచ్‌ఎండీఏలో 124 బిల్డింగులకు పర్మిషన్
- 2025లో 193కు చేరిన అనుమతులు..ఆ మేరకు మౌలిక సదుపాయాలు కరువు
- ఆయా ఏరియాల్లో ట్రాఫిక్, వాటర్, డ్రైన్ కష్టాలు
- హెల్త్ ఎమర్జెన్సీలో అంబులెన్స్రావాలన్నా గంట సమయం..
- అగ్నిప్రమాదాలు జరిగితే అంత ఎత్తుకు వాటర్చిమ్మే పరిస్థితే లేదంటున్న ఫైర్ డిపార్ట్‌మెంట్
- నలుదిక్కులా విస్తరణకు అవకాశమున్న నగరంలో
- హైరైజ్ బిల్డింగుల అవసరమే లేదంటున్న ఎక్స్‌పర్ట్స్
- గుడ్డిగా అనుమతులిస్తే మున్ముందు మరిన్ని కష్టాలు తప్పవని వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: చారిత్రక హైదరాబాద్ నగరం క్రమంగా ‘హైరైజ్’ సిటీగా మారుతున్నది. రెసిడెన్షియల్ జోన్లలోనూ ఆకాశాన్నంటే బిల్డింగుల సంఖ్య ఏటా పెరిగిపోతున్నది. ఓఆర్ఆర్ పరిధిలో 20 ఫ్లోర్లకు మించిన సుమారు1,800 హైరైజ్ బిల్డింగులుండగా, ఇటీవల 50 నుంచి 60 అంతస్తుల ఆకాశహార్మ్యాలు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి.
2024లో జీహెచ్ఎంసీ పరిధిలో 69, హెచ్ఎండీఏ పరిధిలో 55 హైరైజ్ బిల్డింగ్‌లకు పర్మిషన్ ఇచ్చిన అధికారులు.. 2025లో ఏకంగా193 బిల్డింగులకు కొత్తగా అనుమతులిచ్చారు. ఇలా ఇష్టారాజ్యంగా హైరైజ్ బిల్డింగులకు పర్మిషన్లు ఇస్తున్న అధికారులు, వాటి వల్ల తలెత్తే పరిణామాలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఒక -హైరైజ్ బిల్డింగ్‌లో ఉండే జనాభా ఒక మేజర్ గ్రామ పంచాయతీ లేదంటే ఓ చిన్నసైజు పట్టణ జనాభాతో దాదాపు సమానంగా ఉంటున్నది. 30 అంతస్తులకు మించి ఉన్న భవంతిలో 2 వేల నుంచి 5 వేల మందికి పైగా నివసిస్తుంటారు.
ఒకేచోట ఇంత జనాభా ఉన్నప్పుడు ఆ ఒత్తిడిని తట్టుకునేలా విశాలమైన రోడ్లు, వాటర్, డ్రైనేజీ సిస్టమ్, పవర్, హెల్త్ ఫెసిలిటీస్ ఉండాలి. కానీ ఆ స్థాయి మౌలికవసతులు ఉన్నాయా? లేవా? అనేది పట్టించుకోకుండా అనుమతులు ఇస్తుండడంతో ఇప్పటికే చాలా చోట్ల కష్టాలు తీవ్రమయ్యాయి. పీక్‌టైంలో రోడ్లపై ట్రాఫిక్ పెరిగిపోతున్నది. ఉదయం పూట నీటి కటకట తప్పట్లేదు. ఎండాకాలం గ్రౌండ్ వాటర్అడుగంటి నిత్యం వందలకొద్దీ ట్యాంకర్లు తెప్పించాల్సి వస్తున్నది.
ఇందుకు ప్రతినెలా లక్షల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి! ఇక డ్రైనేజీలు పూడుకపోయి ఫ్లాట్లలో దుర్వాసన రావడం పరిపాటిగా మారింది. హెల్త్ ఎమర్జెన్సీ తలెత్తితే కనీసం అంబులెన్స్ రావాలన్నా గంటకు పైగా సమయం పడుతున్నది. దీంతో కోట్లు పోసి హైరైజ్ బిల్డింగుల్లో ఫ్లాట్లు కొనుక్కున్న జనం, ఇప్పుడు తలపట్టుకుంటున్నారు.
పెరిగిన ట్రాఫిక్ కష్టాలు..
హైరైజ్ బిల్డింగ్‌లు ఎంత ఎక్కువగా ఉంటే అంత ట్రాఫిక్ సమస్య అధికమవుతుంది. తాజా ట్రాఫిక్ డేటా ప్రకారం.. హైదరాబాద్ సిటీలో వాహనాల సగటు వేగం ఇటీవలి కాలంలో 25 కిలోమీటర్ల నుంచి 18.4 కిలోమీటర్లకు పడిపోయింది. ఈ విషయంలో ముంబై, ఢిల్లీ కంటే హైదరాబాద్ పరిస్థితి అధ్వానంగా ఉంది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లోని కొండాపూర్, మియాపూర్, ముంబై హైవే వెంబడి, నల్లగండ్ల, తెల్లాపూర్, ఓఆర్ఆర్ ఆనుకొని ఉన్న కోకాపేట్, నార్సింగి, నానక్‌రామ్ గూడ, పుప్పాల గూడ , హబ్సిగూడ, ఉప్పల్, ఘట్ కేసర్‌లో పెద్ద ఎత్తున హై రైజ్ బిల్డింగులు వెలిశాయి.
బిల్డర్ల ప్రచారంతో ఆయాచోట్ల ఫ్లాట్లు కొనుక్కున్న ఐటీ, ఇతర ఎంప్లాయీస్, వారి కుటుంబాలను ఇప్పుడు ట్రాఫిక్సమస్య పట్టిపీడిస్తున్నది. ప్రతి ఫ్లాట్‌కు ఒకటి రెండు కార్లు, రెండు, మూడు బైక్‌లు ఉంటున్నాయి. వీళ్లంతా స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు, ఇతర అవసరాల కోసం ఉదయం 8 నుంచి 11 గంటలు, సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల పీక్ పీరియడ్‌లో బయటికి వస్తున్నారు. దీంతో ఆయా ఎక్సిట్స్, ఎంట్రెన్స్, గేట్ల వద్ద లాంగ్ క్యూలు పెరిగిపోతున్నాయి. ఒకే సారి వందలు, వేలల్లో కార్లు, బైకులు బయటికి రావడంతో ఆయా ఏరియాల్లోని రోడ్లు సరిపోవడం లేదు. దీంతో ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కనీసం 15 నిమిషాలపాటు ఆగాల్సి వస్తున్నది. హైరైజ్బిల్డింగుల్లో నివసించే జనంపై అవగాహన లేకుండా, ఆ మేరకు రోడ్లను విస్తరించకుండా అధికారులు ఎడాపెడా పర్మిషన్లు ఇవ్వడమే ఇందుకు కారణమని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.
వాటర్ సమస్య తీవ్రరూపం..
హై రైజ్ బిల్డింగ్‌లలో నివసిస్తున్న ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో వాటర్ ఒకటి. భూమి నుంచి సుమారు 100, 150 మీటర్ల ఎత్తుతో ఈ బిల్డింగులు నిర్మిస్తున్నారు. గ్రామాల్లో, చిన్నచిన్న పట్టణాల్లో కుటుంబ అవసరాలకు నల్లాలు లేదా బావులు, బోర్లు వేర్వేరుగా ఉంటాయి. అక్కడ ఎలాంటి సమస్య రాదు. కానీ ఇక్కడ వేలాది మంది అవసరాలు తీర్చడానికి 3, 4 బోర్లను 2 వేల ఫీట్ల పైగా లోతు తవ్వి నీటిని తోడుతున్నారు. వాటర్ లిఫ్టింగ్‌కు హై కెపాసిటీ పంప్స్
వాడుతున్నారు.
]పవర్ ఇష్యూస్ వల్ల మోటర్లు తరుచూ పాడవడం, టవర్ల మధ్య సరైన ప్రెషర్ మేనేజ్‌మెంట్ లేకపోవడం వల్ల ఒక భాగంలో ఓవర్‌ఫ్లో, మరొక భాగంలో డ్రై లాంటి పరిస్థితులు ఏర్పడడం, తరుచూ పైపులు పగలడం, నీళ్లు లీకవడం లాంటి కంప్లయింట్స్ వస్తున్నాయి. ఇక ఎండాకాలంలో ఫిబ్రవరి నుంచే బోర్లు ఎత్తిపోతున్నాయి. దీంతో కమ్యూనిటీ అవసరాల కోసం ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లపైనే ఆధారపడ్తున్నారు. హై రైజ్ బిల్డింగ్ ఏరియాల్లో నిరుడు ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ట్యాంకర్ల బుకింగ్స్ 36 శాతం పెరిగాయని రికార్డులు చెప్తున్నాయి. ఉదాహరణకు గతేడాది ఏప్రిల్‌లో 2.90 లక్షల ట్యాంకర్ల బుకింగ్ జరగగా.. ఒక్క గచ్చిబౌలి ఏరియాలోనే 20 శాతం అంటే 60 వేలకు పైగా ట్యాంకర్లు బుక్ చేసుకోవడం గమనార్హం.
పర్మిషన్ఇచ్చిన ఆఫీసర్లు, ఫ్లాట్లు అమ్మేసిన బిల్డర్లు పత్తాలేకుండా పోగా, కేవలం నీటి కోసమే ఒక్కో హైరైజ్ బిల్డింగులో ప్రతి నెలా సగటున రూ.6 లక్షల దాకా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ లెక్కన సమ్మర్లో నీటి కోసమే ఒక్కో ఫ్యామిలీ రూ.4 వేల నుంచి రూ.7 వేల దాకా వెచ్చిస్తున్నది. వాటర్ బోర్డు నుంచి బుక్ చేసిన ట్యాంకర్లు టైమ్‌కు రాక.. పడ్తున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఫ్లాట్లలో నివసించే వాళ్లు తమ గిన్నెలు తోముకోవడానికి, స్నానం చేయడానికి, బట్టలు ఉతకడానికి ఉపయోగించే నీటినే కింద ప్లాంట్‌కు పంపి, మళ్లీ వాటినే ట్రీట్‌మెంట్ చేసి పైకి పంపిస్తున్నారు.
దీంతో నీళ్లు దుర్వాసన వస్తున్నాయనే ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఈ తరహా బిల్డింగులలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్తప్పనిసరి. కానీ వాటిని సరైన సంఖ్యలో పక్కాగా నిర్మించేలా చూడాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో భారీ వర్షాలు పడినప్పుడు ఒక్కసారిగా నీరంతా బయటకు వచ్చి రోడ్లు బ్లాక్అవుతున్నాయి.
ఫెయిల్ అవుతున్న డ్రైనేజీ సిస్టమ్స్
హై-రైజ్ అపార్ట్‌మెంట్లలో సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్బేస్మెంట్ లేదా గ్రౌండ్ లెవల్‌లో ఉంటున్నాయి. ఇక్కడి నుంచి బయటకు వచ్చే వ్యర్థ జలాలు, సెప్టిక్ ట్యాంక్ ఓవర్ఫ్లోస్బయట కార్పొరేషన్డ్రైనేజీకి కనెక్ట్చేస్తున్నారు. హైరైజ్బిల్డింగుల్లోని జనాభాకు తగినట్టుగా బయట డ్రైనేజ్ సిస్టమ్‌ను డెవలప్ చేయకపోవడంతో ఒకేసారి పెద్దమొత్తంలో వస్తున్న మురుగునీరంతా మ్యాన్‌హోల్స్ నుంచి బయటకు తన్నుకొచ్చి రోడ్లపై పారుతున్నది. ఈ రెండు దశల్లోనూ ఆపరేషన్, మెయింటెనెన్స్ లోపాల వల్ల హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ విడుదలవుతున్నది. దీంతో బయట రోడ్ల మీద, ఫ్లాట్లలోని బాత్రూంలు, బాల్కనీల్లోనూ ఆ దుర్వాసన తట్టుకోలేకపోతున్నామనే ఫిర్యాదులు ఇటీవల పెరుగుతున్నాయి.
ఇక బిల్డింగ్పైపులైన్లలో హెయిర్, ఆర్గానిక్ మ్యాటర్ తరుచూ అడ్డుకోవడం వల్ల కూడా సీవర్ గ్యాస్.. పైపుల నుంచి వెనక్కి వస్తున్నట్లు చెప్తున్నారు. హై-రైజ్ బిల్డింగ్‌లలో సెంట్రలైజ్డ్ సీవర్ లైన్ వల్ల ఒక ఫ్లాట్ దగ్గర పైపులు జామ్ అయితే అది ఇతరుల ఫ్లాట్లపై ప్రభావం చూపిస్తున్నది.
హైదరాబాద్‌కు ఆ అవసరం లేదు..
ముంబై లాంటి సిటీల్లో సముద్రం కారణంగా విస్తరణకు అవకాశాలు లేక అక్కడి ప్రభుత్వాలు హైరైజ్ బిల్డింగులకు అనుమతులిస్తున్నాయి. కానీ హైదరాబాద్‌కు అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ సిటీకి నాలుగు వైపులా జాగాలకు కొదువలేదు. ప్రభుత్వం కూడా ఓఆర్‌ఆర్ నుంచి ట్రిపుల్ఆర్ వరకు ల్యాండ్‌ను సెమీ అర్బన్ ఏరియాగా డిక్లేర్ చేసింది. దీంతో ఇక్కడ హైరైజ్బిల్డింగుల అవసరమే లేదని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. సిటీలో కమర్షియల్అవసరాల కోసం హై రైజ్ బిల్డింగ్స్ నిర్మిస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ బడా బడా కంపెనీలు పోటీ పడీ మరీ రెసిడెన్షియల్అవసరాలకు వీటిని నిర్మిస్తున్నాయి.
చదరపు ఫీట్‌కు రూ.10 వేల నుంచి రూ.15 వేల చొప్పున ధరలు నిర్ణయించి వేల కోట్లు సంపాదిస్తున్నారు. మౌలిక సదుపాయాలు లేనప్పటికీ కమీషన్ల కోసం అధికారులు ఎడాపెడా అనుమతులిస్తున్నారు. దేశంలో ఎక్కడా కూడా హైదరాబాద్ మాదిరిగా హై రైజ్ బిల్డింగ్స్ నిర్మించడం లేదు. 2016లో చెన్నైలో వరదలు వచ్చాక హైరైజ్ బిల్డింగ్‌లపై అక్కడి ప్రభుత్వం నియంత్రణ పెట్టింది.
ముంబై, బెంగుళూరులాంటి సిటీల్లో కూడా 20 అంతస్తులలోపే రెసి డెన్షియల్ బిల్డింగ్స్‌కు అనుమతులిస్తున్నారు. ఇక్కడ మాత్రం ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్‌ఎస్ఐ)పై ఎలాంటి పరిమితులు లేకపోవడంతో బడా వ్యాపార సంస్థలు 50, 60 అంతస్తులతో హైరైజ్ బిల్డింగులపైనే ఫోకస్ పెడుతున్నట్టు రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేకించి గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కోకాపేట, ఉస్మాన్ నగర్, తెల్లాపూర్, నల్లగండ్లలాంటి ప్రాంతాల్లోనే ఈ హైరైజ్ బిల్డింగులు ఎక్కువగా నిర్మించి విక్రయాలు జరుపుతున్నారు.
30 శాతానికి పైగా డెంగ్యూ జ్వరాలు ఇక్కడే..
హై-రైజ్ బిల్డింగ్‌లలో దోమలు బెడద తీవ్రంగా ఉంటున్నది. ముఖ్యంగా డెంగ్యూ వ్యాప్తిచేసే దోమలు ఈ బిల్డింగ్‌లలో ఎక్కువగా ఉంటున్నాయి. హైదరాబాద్ సిటీలో నమోదయ్యే డెంగ్యూ కేసుల్లో 30%కి పైగా కేసులు హై-రైజ్ బిల్డింగ్స్‌లోనే నమోద వుతున్నాయని వైద్య శాఖ రిపోర్టులు స్పష్టంచేస్తున్నాయి. బేస్‌మెంట్ పార్కింగ్, వాటర్ ఓవర్ ఫ్లో, గార్బేజ్ ఏరియా దగ్గర నీరు నిలిచి ఉండటం వల్ల దోమలు వృద్ధి చెంది.. లిఫ్ట్ లు, షాఫ్ట్స్, స్టెయిర్ కేస్, వెంటిలేషన్ ద్వారా ఎగువ ఫ్లోర్లకు వెళ్తున్నాయంటున్నారు.
అగ్నిప్రమాదం జరిగితే కాపాడేదెట్ల?
50 మీటర్ల నుంచి 150 మీటర్ల ఎత్తు ఉండే హైరైజ్ బిల్డింగ్‌లలో అగ్ని ప్రమాదం జరిగితే ప్రజ లను కాపాడడం చాలా కష్టమని ఎక్స్‌పర్ట్స్ చెబు తున్నారు. ప్రస్తుతం ఉన్న ఫైర్ఇంజిన్లకు అంత ఎత్తుకు ప్రెషర్‌తో నీటిని తీసువెళ్లే సామర్థ్యం లేదని అంటున్నారు. నిజానికి హై-రైజ్ బిల్డింగ్‌లలో ప్రతి ఫ్లోర్‌లోనూ ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు తప్పనిసరి. స్మోక్ ఫ్రూఫ్ లాబీలు, 8 అంతస్తులకు పైన ఉన్న భవనాల్లో రిఫ్యూజ్ ఏరియాలు(సేఫ్ జోన్) తప్పనిసరిగా కట్టాలి. ప్రతి ఫ్లోర్‌లో ఏబీసీ టైప్ ఫైర్ ఎక్సిటింగ్విషర్లు, ఫైర్ బకెట్స్ ఉండాలి. ఎమర్జెన్సీ లైటింగ్, ఫైర్ అలారం సిస్టమ్ ఏర్పాటు చేయాలి.
ఫైర్ -రెసిస్టెంట్ డోర్స్‌తో ఒక ఫైర్‌మన్ లిఫ్ట్ ఉండాలి. లిఫ్ట్ ల్యాండింగ్ ఏరియాలు వెంటిలేటెడ్ లాబీలో ఉండాలి. అన్ని హై-రైజ్ భవనాల్లో ఆటోమేటిక్ స్ప్రింక్లర్ సిస్టమ్ ఉండాలి. హీట్ డిటెక్టర్లు ప్రతి ఫ్లోర్‌లో, రూమ్‌లలో తప్పనిసరిగా పెట్టాలి. వాటర్ కోసం అండర్ గ్రౌండ్‌లో ఓవర్ హెడ్ ట్యాంక్‌లు నిర్మించాలి. కానీ చాలా బిల్డింగ్స్‌లో ఇవేమీ లేవు. ప్రతి నెలకోసారి అగ్నిప్రమాదం సంభవిస్తే ఎలా తప్పించుకోవాలో వివరించే డ్రిల్స్ నిర్వహించడంలేదు. చట్ట ప్రకారం హై-రైజ్ అంటే సాధారణంగా 15 మీటర్లు ఎత్తుకు మించి నిర్మించే బిల్డింగ్ ఓనర్లు కచ్చితంగా ఫైర్ ఎన్‌వోసీ తీసుకోవాలి.
ఏటా ఫైర్ సేఫ్టీ ఆడిట్ చేయించుకొని రెన్యూవల్ చేయాలి. ఈ వ్యహారమంతా తూతూమంత్రంగా సాగుతున్నది. దీంతో అగ్నిప్రమాదం జరిగినప్పుడు అందులో నివసించే ప్రజలు బయటకు రావడం చాలా కష్టం. హైరైజ్ బిల్డింగులను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌లో కొత్తగా 23 ఫైర్ స్టేషన్లు అవసరం అని ప్రభుత్వం గుర్తించినా.. వాటి ఏర్పాటుకు ఇప్పటివరకు ముందడుగు పడలేదు.
నో అంబులెన్స్.. నో ఫస్ట్ ఎయిడ్ కిట్
నిజానికి 5వేల మంది ఉండే గ్రామంలో ప్రాథ మిక ఆరోగ్య కేంద్రం తప్పనిసరి. అంబులెన్స్ కూడా అందుబాటులో ఉండాలి. కానీ అంతకు మించి జనాభా ఉంటే ఈ హైరైజ్ బిల్డింగ్స్‌లో ఎక్కడా కూడా ఆ పరిస్థితి లేదు. కనీసం ఫస్ట్ ఎయిడ్ కిట్కనిపించడం లేదు. ఎవరికైనా ఎమర్జెన్సీ తలెత్తితే అంబులెన్స్రావాలన్నా గంట సమయం పడుతున్నది. ఎక్కువ ఎత్తు లో ఉండటం వల్ల స్ట్రీట్ లెవల్ సామాజిక జీవి తం తగ్గుతున్నది. ఇరుగు పొరుగుతో ముచ్చ ట్లు, వెజిటేబుల్ వెండర్లతో మాటలు ఉండవు. దీంతో లోన్లీనెస్ వల్ల డిప్రెషన్, ఒత్తిడి పెరుగు తాయి.
పిల్లలు బయట ఆడుకోలేకపోవడం వల్ల సోషల్ స్కిల్స్, ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతు న్నాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, మహి ళలకు ఈ ప్రమాదం ఎక్కువ అని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఎక్కడో 40, 50 అంతస్తుల్లో నివసించే వాళ్లు లిఫ్ట్‌లో కింది నుంచి పైకి వెళ్లా లంటే కనీసం 3 నుంచి 5 నిమిషాల సమ యం పడుతున్నది. దీంతో ఒకసారి పైకి వెళితే కిందికి రావడం కష్టం. సామాజిక సంబంధా లు తగ్గుముఖం పడుతుండడంతో హై-రైజ్ నివాసితుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు పెరు గుతున్నట్లు అధ్యయనాలు చెప్తున్నా.. ఆమేర కు మానసిక నిపుణులను అందుబాటులో ఉంచాలన్న సోయి అటు కమ్యూనిటీలకు గానీ, అధికారులకుగానీ ఉండడం లేదు.
