ముంబై: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా అంబెనాలి ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై వెళుతున్న ఓ కారు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 8 మంది చనిపోయారు. ముంబైకి 180 కిలోమీటర్ల దూరంలోని పోలాద్‌పూర్-మహాబలేశ్వర్ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది.
బాధితులు దాపోలి నుంచి సతారా వెళ్తుండగా ఘాట్ రోడ్డులో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు లోయలోకి దూసుకెళ్లిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రయాణికులు గమ్యస్థానానికి చేరకపోవడంతో ఆందోళన చెందిన బంధువులు పోలీసులను ఆశ్రయించారు.
మొబైల్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు గాలించగా సోమవారం ఉదయం లోయలో వాహనం లభ్యమైంది. మృతుల వయస్సు 19 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుంది. వీరిలో ఏడుగురు సతారా జిల్లాకు, ఒకరు రత్నగిరి జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
