ఇంటర్ బోర్డు..  ఇదేం అఫిలియేషన్?..జూన్ 1న కాలేజీలు ఓపెన్.. కానీ అనుమతుల్లేవు

ఇంటర్ బోర్డు..  ఇదేం అఫిలియేషన్?..జూన్ 1న కాలేజీలు ఓపెన్.. కానీ అనుమతుల్లేవు
  • 16 జిల్లాల్లో ఒక్క ప్రైవేటు కాలేజీకీ గుర్తింపు ఇవ్వలేదు 
  • మే 31 డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ అయినా పట్టించుకోని బోర్డు
  • కొత్త సెక్రటరీ వచ్చాక నిలిచిన ఫైళ్లు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియ ఇంటర్ బోర్డు తీరుతో గందరగోళంగా మారింది. జూన్ 1 నుంచి ఫస్టియర్, సెకండియర్ క్లాసులు  ప్రారంభం కానున్నాయని బోర్డు ఇప్పటికే ప్రకటించింది. కానీ, విద్యా సంవత్సరం ముంగిట ఉన్నా.. కాలేజీలకు ఇవ్వాల్సిన గుర్తింపు ఫైళ్లు మాత్రం బోర్డులోనే ఉండిపోయాయి. 

గడువు మే 31 కానీ..

మే 31లోగా అఫిలియేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని బోర్డు అధికారులు గతంలో ప్రకటించారు. ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ ఇచ్చి కాలేజీల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,400 వరకు అన్ని మేనేజ్​మెంట్ల కాలేజీలు రిజిస్టర్ చేసుకున్నాయి. తీరా గడువు ముగియడానికి కొన్ని రోజులే సమయం ఉన్నా.. సోమవారం సాయంత్రం నాటికి అనుమతులు వచ్చింది మాత్రం 1,093 కాలేజీలకు మాత్రమే. ప్రైవేటు కాలేజీల పరిస్థితి అయితే మరీ దారుణం. 1,400 కాలేజీలు దరఖాస్తు చేసుకుంటే, ఇప్పటివరకు కేవలం 209 కాలేజీలకు మాత్రమే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో వారంలో కొత్త అకాడమిక్ ఇయర్ ప్రారంభం కానున్నది. అయినా, ఇప్పటికీ అఫిలియేషన్లపై మాత్రం బోర్డు దృష్టి సారించలేదు. 

సర్కారు కాలేజీలకూ దిక్కులేదు

ప్రైవేటు కాలేజీల మాట పక్కన పెడితే.. సొంత సర్కారు కాలేజీల విషయంలోనూ ఇంటర్ బోర్డు అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. 430 ప్రభుత్వ కాలేజీలకు గాను ఇప్పటివరకు కేవలం 208 కాలేజీలకు మాత్రమే గుర్తింపు లభించింది. 403 కేజీబీవీల్లో 186 కాలేజీలు, 194 మోడల్ స్కూళ్లలో కేవలం 56 కాలేజీలకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల గుర్తింపు ప్రక్రియ కూడా నత్తనడకన సాగుతున్నది. సర్కారు కాలేజీలకూ గుర్తింపు ఎందుకు ఆపారనే దానికి అధికారులకూ స్పష్టత లేదు. అయితే, దాదాపు నెల రోజుల క్రితం ఇంటర్ బోర్డుకు సెక్రటరీగా అభిలాష అభినవ్ వచ్చారు. ఆ తర్వాత అఫిలియేషన్ల ఫైళ్ల కదలిక మందగించిందని మేనేజ్​మెంట్లు ఆరోపిస్తున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఒక్క కొత్త కాలేజీకీ గుర్తింపు ఇవ్వలేదని విమర్శిస్తున్నాయి. 

అడ్మిషన్లు మొదలైనయ్

రాష్ట్రంలో 2026-–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియెట్ అడ్మిషన్ల షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను రెండో వారంలో రిలీజ్ చేశారు. ఈ నెల12 నుంచి 31 వరకు ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనున్నది. అన్నీ కాలేజీలూ అప్పుడే అడ్మిషన్లు చేపట్టాలని ఇంటర్ బోర్డు ప్రకటించింది. కానీ, అఫిలియేషన్లు ఇప్పటికీ రాకపోయినా.. ఇప్పటికే కార్పొరేట్ కాలేజీల్లో దాదాపు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది. ప్రైవేటు కాలేజీల్లోనూ అడ్మిషన్లు జోరుగా సాగుతున్నాయి. ఒకవేళ ఆయా కాలేజీలకు ఇంటర్ బోర్డు అఫిలియేషన్ ఇవ్వకపోతే.. వాటిలో చేరిన పిల్లల పరిస్థితి ఏంటనే దానికి ఇంటర్ అధికారుల నుంచి ఆన్సర్ కరువైంది. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి, అఫిలియేషన్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని పేరెంట్స్ కోరుతున్నారు. 

16 జిల్లాల్లో ఒక్క కాలేజీకి కూడా ఇవ్వలేదు..

స్టేట్ వైడ్​గా సుమారు 1,400 ప్రైవేటు జూనియర్ కాలేజీలున్నాయి. వీటిలో ఇప్పటివరకు 16 జిల్లాల్లో ఒక్క కాలేజీకి కూడా ఇంటర్ బోర్డు నుంచి అఫిలియేషన్ రాలేదు. ఈ లిస్టులో నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి, సూర్యాపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, ములుగు, నారాయణపేట తదితర జిల్లాలున్నాయి. అయినా ఆయా జిల్లాల్లో అడ్మిషన్లు జోరుగా సాగుతున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, జనగామ, భద్రాద్రి, గద్వాల తదితర జిల్లాల్లో ఒక్కో ప్రైవేటు కాలేజీకి, కరీంనగర్, నిర్మల్  జిల్లాలోల రెండు కాలేజీల చొప్పున మాత్రమే గుర్తింపు ఇచ్చారు. హైదరాబాద్ లోని మూడు జోన్లు కలిపి కేవలం 40 కాలేజీలకు, రంగారెడ్డి 46, మేడ్చల్ 58, హనుమకొండ 28, నల్గొండలో 11, వరంగల్ ఆరు, ఖమ్మంలో ఐదు కాలేజీలకు అనుమతి లభించింది. 

గడువులోగా పూర్తి చేస్తం

ఇంటర్మీడియెట్ అఫిలియేషన్ల ప్రక్రియను గడువులోగా పూర్తి చేస్తం. కాలేజీ మేనేజ్​మెంట్ల ఆరోపణలు పట్టించుకోం. నిబంధనల ప్రకారం గుర్తింపు ఇస్తం. - అభిలాష, ఇంటర్ బోర్డు సెక్రటరీ