ప్రతిరోజు మామిడి పండు తినడం వల్ల మన శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే మామిడి ఒక ఉష్ణమండల పండు. ఇది జీడిపప్పు, పిస్తా పప్పుల కుటుంబానికి చెందినది. నోట్లో వేసుకుంటే కరిగిపోయే అంత మెత్తగా, ఆకర్షణీయమైన పసుపు రంగు, అద్భుతమైన తీపి రుచి మామిడి సొంతం. ఇందులో శరీరానికి అవసరమైన పోషకాలతో పాటు కెరోటినాయిడ్లు అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మామిడికి అందమైన పసుపు రంగును ఇచ్చేవి ఇవే. ప్రతిరోజూ మామిడి పండును తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో, దీని పోషకాల విలువలేంటో చూద్దామా....
మామిడి పండు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు
జీర్ణక్రియ సజావుగా సాగడానికి పీచు పదార్థం చాలా అవసరం. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. ఒక కప్పు మామిడి ముక్కల నుండి మన శరీరానికి ఒక రోజుకు కావలసిన ఫైబర్‌లో 10 శాతం లభిస్తుంది. ఇందులో 'పెక్టిన్' అనే ప్రత్యేక ఫైబర్ ఉంటుంది. ఇది మన కడుపులోని మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా పనిచేస్తుంది. దీనివల్ల కడుపులో మంట, ప్రేగు వ్యాధులు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
కంటి చూపు
మామిడి పండ్లలో బీటా కెరోటిన్, ల్యూటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి ఎంతో మేలు చేస్తాయి. శరీరంలోకి వెళ్లిన బీటా కెరోటిన్ 'విటమిన్ ఎ' గా మారుతుంది. ఒక మామిడి పండు ద్వారా ప్రతిరోజు అవసరానికి సరిపడా విటమిన్ ఎ లో 12% లభిస్తుంది. విటమిన్ ఎ కేవలం కంటి చూపుకే కాకుండా, సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, గర్భధారణ సమయంలో పిండం ఆరోగ్యకరంగా ఎదగడానికి తోడ్పడుతుంది.
కీళ్ల నొప్పులు
మామిడి పండులో 'విటమిన్ సి' చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో 'కొల్లాజెన్' అనే ప్రోటీన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. కొల్లాజెన్ అనేది మన చర్మం, ఎముకలు, కీళ్లు, నరాలకు బలాన్ని ఇచ్చే ఒక ముఖ్యమైన పదార్థం. ఇది కీళ్ల మధ్య జిగురును పెంచి, ఎముకల మధ్య ఘర్షణను తగ్గిస్తుంది.
గుండె ఆరోగ్యం
ఒక కప్పు మామిడి పండు తింటే, ప్రతిరోజు శరీరానికి కావలసిన పొటాషియంలో 8 శాతం అందుతుంది. బిపి అదుపులో ఉంచడానికి పొటాషియం చాలా ముఖ్యం. శరీరంలో పొటాషియం తగ్గితే గుండె రక్తాన్ని పంప్ చేయడం కష్టమవుతుంది. ఇది మెల్లిమెల్లిగా హైబీపీ, పక్షవాతం, గుండె జబ్బులకు దారితీస్తుంది. కాబట్టి మామిడి గుండెకు రక్షణగా నిలుస్తుంది.
మామిడిలోని విటమిన్ సి, మనం తినే ఆహారంలోని ఐరన్ ను శరీరం సులభంగా పీల్చుకునేలా చేస్తుంది. ముఖ్యంగా తోటకూర, పాలకూర వంటి మొక్కల ఆధారిత ఆహారంతో పాటు మామిడి పండును తీసుకుంటే రక్తహీనత సమస్య త్వరగా తగ్గుతుంది.
ఒక కప్పు మామిడి ముక్కల్లో ఉండే పోషకాలు (సుమారు 165 గ్రాములు):
*కేలరీలు: 99
*కార్బోహైడ్రేట్లు: 25 గ్రాములు
*ఫైబర్ (పీచు పదార్థం): 3 గ్రాములు
*సహజ చక్కెర: 22.5 గ్రాములు
*ప్రోటీన్: 1 గ్రాము
*కొవ్వు: 0.6 గ్రాములు
*సోడియం: 2 మిల్లీగ్రాములు
*పొటాషియం: 277 మిల్లీగ్రాములు
*విటమిన్ సి: 60 మిల్లీగ్రాములు
*విటమిన్ ఎ: 89 మైక్రోగ్రాములు
*విటమిన్ బి6: 0.2 మిల్లీగ్రాములు
(దీనితో పాటు మెగ్నీషియం, కాపర్, ఫోలేట్ వంటివి కూడా తక్కువ మొత్తంలో లభిస్తాయి)
మామిడి పండ్లు అందరూ తినవచ్చా
సాధారణంగా మామిడి అందరికీ సురక్షితమే. కానీ జీడిపప్పు అలర్జీ ఉన్నవారికి మామిడి తింటే చర్మంపై దద్దుర్లు రావచ్చు. అలాంటి వారు దీనికి దూరంగా ఉండాలి. కొన్నిసార్లు మామిడి తొక్క తీసేసి లోపలి గుజ్జు మాత్రం తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
షుగర్ ఉన్నవారు: చక్కెర ఎక్కువగా ఉంటుందని షుగర్ వ్యాధిగ్రస్తులు మామిడి పండు తినకూడదనేది ఒక అపోహ మాత్రమే. మామిడి పండు 'గ్లైసెమిక్ ఇండెక్స్' తక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ ఉన్నవారు కూడా దీనిని పరిమితంగా తినవచ్చు. అయితే, దీనిని తినేటప్పుడు కాటేజ్ చీజ్ (పనీర్), గుమ్మడి గింజలు లేదా చియా సీడ్స్ వంటి ప్రోటీన్లు లేదా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారంతో కలిపి తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగవు.
మామిడి పండ్లను తినే సులువైన మార్గాలు
బాగా పండిన, కొద్దిగా మెత్తగా అనిపించే మామిడి పండ్లు ఎక్కువ తియ్యగా ఉంటాయి. మామిడి ముక్కలను మిక్సీ పట్టి చిక్కటి స్మూతీగా చేసుకోవచ్చు. పైనాపిల్, కొబ్బరి పాలు కలిపితే ఇది మరింత రుచిగా ఉంటుంది. ఐస్ చేసిన మామిడి ముక్కలను కొద్దిగా పాలు పోసి మిక్సీ పడితే, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేని సహజమైన 'ఐస్ క్రీమ్' సిద్ధమవుతుంది. మామిడి గుజ్జును ఓవెన్‌లో లేదా ఎండలో ఎండబెట్టి 'మామిడి తాండ్ర' లాగా చేసి నిల్వ చేసుకోవచ్చు. పిల్లలకు ఇది మంచి స్నాక్. ఆకుకూరలు, చికెన్ లేదా రొయ్యల ముక్కలతో పాటు తాజా మామిడి ముక్కలను కలిపి, కొద్దిగా నిమ్మరసం చల్లుకుని సలాడ్‌లా తినవచ్చు. ఇంకా ఖర్జూరాలు, నట్స్‌తో పాటు ఎండిన మామిడి ముక్కలను కలిపి చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకుని ప్రయాణాల్లో తినవచ్చు. మామిడి ముక్కలు, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మరసం కలిపి చేసే 'సల్సా' చికెన్ లేదా రోటీల్లోకి నంజుకోవడానికి చాలా బాగుంటుంది.
