ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇండియన్ నేవీలో పర్మినెంట్ కమిషన్ ఉద్యోగం సాధించాలనుకునే యువతకు సువర్ణావకాశం. 10+2 (బి.టెక్) కేడెట్ ఎంట్రీ స్కీమ్ కింద ఖాళీల భర్తీకి ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జేఈఈ మెయిన్-2026 స్కోరు ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు మే 29 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు: 10+2 (బి.టెక్) కేడెట్ ఎంట్రీ స్కీమ్– పర్మినెంట్ కమిషన్.
మొత్తం ఖాళీలు: 60. (మహిళలకు గరిష్టంగా ఎనిమిది ఖాళీలు ఉంటాయి).
విభాగాల వారీగా ఖాళీలు: మెకానికల్ ఇంజినీరింగ్ 30, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 30.
ఎలిజిబిలిటీ
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సీనియర్ సెకండరీ పరీక్ష (10+2 ప్యాటర్న్) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ (పీసీఎం)ల్లో కనీసం 70 శాతం అగ్రిగేట్ మార్కులు సాధించి ఉండాలి. 10వ తరగతి లేదా 12వ తరగతిలో ఇంగ్లిషు సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.
జేఈఈ (మెయిన్) 2026 పరీక్షకు (బీఈ/ బి.టెక్ కోసం) తప్పనిసరిగా హాజరై ఉండాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించిన జేఈఈ (మెయిన్) ఆల్ ఇండియా కామన్ ర్యాంక్ లిస్ట్ (సీఆర్ఎల్) 2026 ఆధారంగా ఎస్ఎస్బీ ఇంటర్వ్యూకు పిలుస్తారు. అభ్యర్థులు దరఖాస్తులో తమ సీఆర్ఎల్ ర్యాంక్‌ను తప్పనిసరిగా నింపాలి.
ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు (మహిళలు, పురుషులు) తప్పనిసరిగా అవివాహితులు అయి ఉండాలి. ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏ), ఎజిమలలో 4 సంవత్సరాల బి.టెక్ శిక్షణ పూర్తి అయ్యేవరకు అభ్యర్థులు వివాహం చేసుకోకూడదు. ఒకవేళ ఎవరైనా శిక్షణా కాలంలో పెళ్లి చేసుకుంటే వారిని అకాడమీ నుంచి డిస్మిస్ చేస్తారు. అంతేకాకుండా, అప్పటివరకు వారి శిక్షణ కోసం ప్రభుత్వం పెట్టిన ఖర్చు మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
వయోపరిమితి: 2007, జులై 2 నుంచి 2010, జనవరి 1 మధ్యలో జన్మించి ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మే 29.
లాస్ట్ డేట్: జూన్ 18.
ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ షెడ్యూల్: 2026 , సెప్టెంబర్.
ఇంటర్వ్యూ కేంద్రాలు: బెంగళూరు/ భోపాల్/ కోల్ కతా/ విశాఖపట్నం.
సెలెక్షన్ ప్రాసెస్: జేఈఈ (మెయిన్) ఆల్ ఇండియా కామన్ ర్యాంక్ లిస్ట్ (సీఆర్ఎల్) 2026 ఆధారంగా షార్ట్ లిస్టింగ్, సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ www.joinindiannavy.gov.inను సందర్శించండి.
శిక్షణ: ఇది 4 సంవత్సరాల పూర్తి స్థాయి బి.టెక్ కోర్సు. 2027, జనవరి నుంచి ఈ బ్యాచ్ శిక్షణ ప్రారంభమవుతుంది. కేరళలోని ఎజిమలలో ఉన్న ప్రతిష్టాత్మక ఇండియన్ నేవల్ అకాడమీలో శిక్షణ ఉంటుంది.
ఉచిత విద్య, వసతి: ఈ శిక్షణకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ఇండియన్ నేవీ భరిస్తుంది. అభ్యర్థులకు ఉచిత వసతి, భోజనం, దుస్తులు, పుస్తకాలను నేవీ ఉచితంగా అందిస్తుంది.
ఇంజినీరింగ్ డిగ్రీ: నాలుగేళ్ల శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి బి.టెక్ డిగ్రీ లభిస్తుంది. అభ్యర్థులు ఎంచుకున్న విభాగాల ప్రకారం (మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్) డిగ్రీ ప్రదానం చేస్తారు.
మిలిటరీ & నావికాదళ శిక్షణ : అకడమిక్ విద్యతోపాటు అభ్యర్థులకు సైనిక క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, నాయకత్వ లక్షణాలు, ఆయుధాల వినియోగం, నౌకాయానానికి సంబంధించిన ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
సబ్-లెఫ్టినెంట్ హోదా: నాలుగేళ్లు శిక్షణ, బి.టెక్ విజయవంతంగా పూర్తి కాగానే, అభ్యర్థులను ఇండియన్ నేవీలో సబ్ -లెఫ్టినెంట్ హోదాతో ఆఫీసర్లుగా విధుల్లోకి తీసుకుంటారు. ఇది గ్రూప్-–ఏ గెజిటెడ్ ఆఫీసర్ కేడర్ ఉద్యోగం.
