అరవ రాజకీయం: అన్నా డీఎంకేకు ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు గుడ్‌‌‌‌ బై..

అరవ రాజకీయం: అన్నా డీఎంకేకు ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు గుడ్‌‌‌‌ బై..
  •  మరో ఐదుగురు ఎమ్మెల్యేలు తిరిగి పళనిస్వామి గూటికి

చెన్నై: అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని తిరుగుబాటు వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సోమవారం తమ పదవులకు రాజీనామా చేశారు. మధురాంతకం నుంచి గెలిచిన మరగాథం కుమారవేల్, ధరాపురం నుంచి పి.సత్యభామ, పెరుందురై నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎస్.జయకుమార్ సోమవారం తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌‌‌‌ను కలిసి తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. 

రాజీనామా చేసిన కొద్దిసేపటికే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రి ఆధవ్ అర్జునను ఆయన ఛాంబర్‌‌‌‌లో కలిశారు. వీరు త్వరలోనే సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం. మే 13న జరిగిన బల పరీక్షలో పార్టీ విప్‌‌‌‌ను ధిక్కరించి టీవీకే ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేసిన 25 మంది ఎమ్మెల్యేల్లో ఈ ముగ్గురు కూడా ఉన్నారు. కాగా, షణ్ముగం-, వేలుమణి శిబిరంలో ఉన్న ఐదుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తిరిగి పార్టీ అధినేత ఎడప్పాడి కె.పళనిస్వామి వైపునకు వచ్చారు.

 వేలుమణి శిబిరాన్ని వీడిన ఎమ్మెల్యేల్లో ఎస్.ఎం.సుకుమార్ (ఆర్కాట్) కూడా ఉన్నారు. ఈ ఐదుగురి చేరికతో అసెంబ్లీలో పళనిస్వామికి మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల సంఖ్య 27కు చేరింది. ముగ్గురి రాజీనామా, ఐదుగురు ఎమ్మెల్యేలు తిరిగి పళనిస్వామి శిబిరానికి వెళ్లడంతో తిరుగుబాటు వర్గం బలం ఇప్పుడు 25 నుంచి 17కు పడిపోయింది.