- బీజేపీ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
- మార్కెట్ యార్డుల్లోని ప్రతి గింజనూ కేంద్రమే కొనుగోలు చేయాలి
- పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రైతు భరోసా పేరుతో బీజేపీ చేపడుతున్న యాత్రలు మోసపూరితమని, అవి కేవలం రాజకీయ డ్రామాలేనని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఒకవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి ప్రజలపై భారం మోపుతుంటే.. మరోవైపు రైతులకు భరోసా పేరుతో బీజేపీ నేతలు యాత్రలు చేయడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. రైతు వ్యతిరేక విధానాలతో ప్రజలను బీజేపీ మభ్యపెడుతోందని సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
మార్కెట్ యార్డుల్లోని ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. బీజేపీ చేస్తున్న బస్సు యాత్రలు ప్రజల దృష్టిని, అసలు సమస్యల నుంచి మళ్లించేందుకేనని అన్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలులో కేంద్రం విఫలమైందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 75 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోగా, కేంద్రం కేవలం 53.73 లక్షల టన్నుల కొనుగోలుకే అనుమతి ఇచ్చిందన్నారు. తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ ఏశారు.
బీజేపీకి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు: విప్ విజయ రమణారావు
రైతు వ్యతిరేక నల్లచట్టాలు తీసుకొచ్చిన బీజేపీకి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ప్రభుత్వ విప్ విజయ రమణారావు అన్నారు. రైతులు పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసినా.. ధాన్యం కొనుగోలు విషయంలో ఆశించిన స్పందన రాలేదని అన్నారు.
రాష్ట్ర బీజేపీ నేతలు యాత్రలు చేయడం మానేసి ఢిల్లీ వెళ్లి మోదీ ఇంటి ముందు ధర్నా చేసి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేలా ఒత్తిడి తేవాలని బీజేపీ నేతలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సూచించారు. బీజేపీ బస్సు యాత్రను చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
