- కాగితాలకే పరిమితమైన రిపేర్ల ప్రతిపాదనలు
- గతేడాది కెనాల్ నీరు బయటకు వచ్చి నీటమునిగిన పరిసర ప్రాంతాలు
- వర్షాకాలం సమీపిస్తుండటంతో స్థానికుల్లో ఆందోళన
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు కెనాల్ రోజురోజుకు కూలుతోంది. కొంత కాలంగా దీన్ని పట్టించుకోకపోవడంతో కోమటి చెరువు నుంచి నర్సాపూర్ చెరువుకు వెళ్లే మార్గంలో కెనాల్ గోడలు పలు చోట్ల కూలిపోగా, కెనాల్ బెడ్ కూడా కుంగింది. గతేడాది వచ్చిన వరదతో కోమటి చెరువు కెనాల్ ధ్వంసం కాగా రిపేర్ చేయలేదు. దీంతో రోజురోజుకు మరింత కూలుతోంది. వర్షాకాలం సమీపిస్తుండగా కెనాల్ రిపేర్ ప్రతిపాదనల్లోనే ఉండడంతో వరదలకు మరింత ధ్వంసం అవుతుందని ఆందోళన కలిగిస్తోంది.
కోమటిచెరువు మత్తడి మీదుగా కెనాల్
రెండు దశాబ్దాల క్రితం కోమటి చెరువు మత్తడి మీదుగా నర్సాపూర్ చెరువులోకి నీరు వెళ్లేందుకు కెనాల్ నిర్మించారు. ఎన్సాన్‌పల్లి రోడ్డు నుంచి హైదరాబాద్ రోడ్డులోని బావిస్‌ఖాన్ పూల్ దాటిన తర్వాత కొంత మేర మరో కెనాల్‌ను నిర్మించారు. ఈ కాలువ ద్వారా కోమటి చెరువు మత్తడి నుంచి వచ్చే నీళ్లు సులభంగా నర్సాపూర్ చెరువుకు చేరుతున్నాయి. దాదాపు 30 ఫీట్ల వెడల్పు, 12 ఫీట్ల లోతుతో తడకపల్లి, ఎన్సాన్ పల్లి నుంచి వచ్చే వరద కోమటి చెరువులోకి చేరి మత్తడి మీదుగా నర్సాపూర్ చెరువులోకి వెళ్లేలా దీనిని నిర్మించారు.
కొంత కాలంగా కోమటి చెరువు కెనాల్‌కు రిపేర్లు చేయకపోవడంతో పలు చోట్ల డ్యామేజ్ అవుతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో వచ్చిన వరదలతో ఈ కెనాల్ తీవ్రంగా దెబ్బతింది. ఎన్సాన్‌పల్లి రోడ్డు నుంచి 500 మీటర్ల వరకు కెనాల్ సైడ్ వాల్స్ కూలిపోగా బెడ్ సైతం దెబ్బతింది. కెనాల్ సిల్ట్‌ను తొలగించకపోవడంతో వరద బయటకు రావడంతో గోడలు దెబ్బతినడమే కాకుండా ప్రమాదకరంగా తయారైంది.
నిధుల కోసం ప్రతిపాదనలు
కోమటి చెరువు కెనాల్ భరత్‌నగర్, శ్రీనగర్ కాలనీ, టీచర్స్ కాలనీల సమీపంలో తీవ్రంగా దెబ్బతినడంతో రిపేర్లకు ఇరిగేషన్ శాఖ ఇప్పటికే రూ.3కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ నిధులు మంజూరైతే కెనాల్ రిపేర్లు పూర్తయి, వరద ముప్పు ఉండదని స్థానికులు భావిస్తున్నారు. మరోవైపు దెబ్బతిన్న కెనాల్‌లో మురుగు పేరుకుపోతుండడంతో దుర్గందంతో పాటు దోమలు తీవ్రంగా వ్యాపిస్తున్నాయి. కొంతకాలంగా గుర్రపు డెక్కతో నిండిపోవడంతో నీరు నిలచి ఇబ్బందులు కలిగిస్తోంది. దీనివల్ల వచ్చే వర్షా కాలంలో నీరు ముందుకు కదలక కాలనీల్లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. గతేడాది ఎదురైన పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
