జనగణనలో ఓబీసీ కుటుంబాలను లెక్కించాల్సిందే : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

జనగణనలో ఓబీసీ కుటుంబాలను లెక్కించాల్సిందే : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
  • బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం పార్లమెంటులో పోరాడుతామని కామెంట్ 

హైదరాబాద్, వెలుగు: దేశంలో త్వరలో జరగబోయే జనగణనలో ఓబీసీ కుటుంబాలను కచ్చితంగా లెక్కించాల్సిందేనని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో జాతి జనగణనతో పాటు బీసీ కుల గణన చేపట్టాలనే డిమాండ్‌‌‌‌పై కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా పోరాడుతామని ఆయన వెల్లడించారు. వచ్చే నెల 7న బెంగళూరులో నిర్వహించనున్న ఓబీసీ మహాసభలకు హాజరు కావాల్సిందిగా ఆదివారం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌‌‌‌ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆహ్వానించారు.

అనంతరం మహాసభలకు సంబంధించిన పోస్టర్‌‌‌‌‌‌‌‌ను పీసీసీ చీఫ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలోని బీసీలకు చట్టబద్ధమైన హక్కులు దక్కాలంటే సమగ్ర కుల గణన చేపట్టాలని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో దామాషా పద్ధతిలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.      

గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీల సత్తా చూపుతాం: జాజుల

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. దేశ జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీల హక్కుల సాధన కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కోట్లాది మందిని ఏకం చేస్తామని, గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీల సత్తా చాటుతామని హెచ్చరించారు. ప్రస్తుత వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేసుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వం చూస్తోందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు విక్రమ్ గౌడ్, శ్రీనివాస్ ముదిరాజ్, కనకాల శ్యామ్, సంఘని మల్లేశ్వర్ పాల్గొన్నారు.