ఆగస్ట్‌ 1న మహాధర్నా ..పోస్టర్‌‌ ఆవిష్కరించిన తపస్‌ నేతలు

ఆగస్ట్‌ 1న మహాధర్నా ..పోస్టర్‌‌ ఆవిష్కరించిన తపస్‌ నేతలు

హైదరాబాద్, వెలుగు: ఆగస్టు1న తపస్​ ఆధ్వర్యంలో నిర్వహించే మహా ధర్నా పోస్టర్​ను ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఏవీఎన్​ రెడ్డి, మల్క కొమురయ్య, ఆ సంఘం నేతలు ఆదివారం హైదరాబాద్​లో ఆవిష్కరించారు. తపస్ రాష్ట్ర అధ్యక్షుడు వొద్నాల రాజశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు  ఏవీఎన్​ రెడ్డి, మల్క కొమురయ్య మాట్లాడుతూ.. సీపీఎస్​ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్​ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్​ చేశారు.

పెండింగ్​లో ఉన్న పీఆర్సీ నివేదికను వెంటనే విడుదల చేసి 51 శాతం ఫిట్​, పెండింగ్​లో ఉన్న ఆరు డీఏలను వెంటనే  ప్రకటించాలన్నారు. ఉపాధ్యాయుల వార్షిక పదోన్నతులు, బదిలీల క్యాలెండర్‌‌‌‌ను వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు. ఈహెచ్​ఎస్​  పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌‌‌‌లోని అన్ని గుర్తింపు పొందిన సంఘాలకు ట్రస్ట్‌‌‌‌లో ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్​ చేశారు. ఆగస్టు 1న ఇందిరాపార్కు వద్ద నిర్వహించే ధర్నాలో టీచర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తపస్​ సంఘం నేతలు పిలుపునిచ్చారు.