- నేతలు మారకపోతే ప్రత్యామ్నాయం తప్పదని వార్నింగ్
- తాజాగా బండి, ఈటల, అరవింద్‌తో అభయ్ పాటిల్ భేటీ
- రంగంలోకి ఆర్ఎస్ఎస్.. క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బీజేపీలో గ్రూపు రాజకీయాలపై ఢిల్లీ పెద్దలు నజర్ పెట్టారు. ‘ఎవరికి వారే.. యమునా తీరే’ అన్నట్లుగా సాగుతున్న నేతల తీరుపై హైకమాండ్ సీరియస్ గా ఉంది. వర్గపోరుకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే రాష్ట్రంలో పార్టీ మనుగడ కష్టమని భావించిన అధిష్టానం.. దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే అధిష్టానం దూతగా రాష్ట్ర ఇన్చార్జి అభయ్ పాటిల్ రంగంలోకి దిగారు.
రాష్ట్ర నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్‌లతో ఆయన విడివిడిగా భేటీ అయ్యారు. విభేదాలు పక్కన పెట్టి కలిసి పని చేయాలని, లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణ బీజేపీలో నాలుగు ప్రధాన వర్గాలు ఉన్నాయనే చర్చ పార్టీ వర్గాల్లోనే కొంతకాలంగా జోరుగా సాగుతోంది.
కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్ పేరుతో ఎవరికి వారు ప్రత్యేక గ్రూపులు నడుపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వర్గపోరు కేవలం రాష్ట్ర స్థాయికే పరిమితం కాకుండా జిల్లాలకూ పాకింది. పాతబస్తీ నుంచి నిజామాబాద్ వరకు అన్ని చోట్లా గ్రూపుల గోల కేడర్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్ర స్థాయి నేతలే ఇలా ఉంటే.. కింది స్థాయి కార్యకర్తలు ఎవరి వెంట వెళ్లాలో తెలియక అయోమయంలో పడిపోతున్నారు.
పాతవాళ్లు వర్సెస్ కొత్తవాళ్లు..
పార్టీలో మరో ప్రధాన సమస్య ఒరిజినల్ వర్సెస్ జంపర్ల మధ్య నడుస్తోంది. మొదటి నుంచి బీజేపీ, సంఘ్ సిద్ధాంతాలను నమ్ముకున్న పాత నేతలకు.. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన కొత్తవారికి మధ్య గ్యాప్ పెరుగుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారని పాతవాళ్లు, తమను పక్కన పెడుతున్నారని కొత్తవాళ్లు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.
దీనికి తోడు పలు జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య కూడా పొంతన కుదరడం లేదనే వాదనలున్నాయి. ఎవరికి వారే తామే సుప్రీం అన్నట్టు వ్యవహరిస్తుండటంతో కేడర్ లో గందరగోళం నెలకొంది. దీనిపై అధిష్టానం దృష్టి సారించాల్సిన అవసరముందని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.
రంగంలోకి సంఘ్ పెద్దలు..
ఇటీవల బెంగాల్ లో జరిగిన ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఆర్ఎస్ఎస్ పెద్దలతో తొలుత పార్టీ నేతలు చర్చలు జరిపినట్టు తెలిసింది. ఈ క్రమంలో సంఘ్ ప్రతినిధులు తెలంగాణ పరిస్థితులపై అధిష్టానానికి ఒక నివేదిక ఇచ్చినట్టు సమాచారం. పార్టీలో క్రమశిక్షణ తప్పుతోందని, గ్రూపు రాజకీయాలకు వెంటనే చెక్ పెట్టాలని పేర్కొన్నారు.
ఇలాగే కొనసాగితే ప్రజల్లో పార్టీపై ఉన్న విశ్వాసం పోతుందని, వెంటనే ప్రక్షాళన చేయాలని సంఘ్ పెద్దలు సూచించినట్టు తెలిసింది. ప్రధానంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య ఉన్న గ్యాప్‌ను పూడ్చకపోతే రాబోయే ఎన్నికల్లో కమలం వికసించడం కష్టమని వారు తేల్చి చెప్పినట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
మారకపోతే ‘ఆల్టర్నేట్’ తప్పదు..
తెలంగాణలో కేంద్రమంత్రులు, పార్టీ పెద్దల పర్యటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో వారు ముఖ్యనేతలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. నేతల మధ్య విభేదాలు, గ్రూపులకు స్వస్తి చెప్పాల్సిందేనని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అయినా వారిలో మార్పు రాకపోతే కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు ఢిల్లీ పెద్దలు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే వారిపై వేటు వేయడానికైనా వెనకాడబోమనే సంకేతాలు పంపారు. విభేదాలను పక్కన పెట్టి ప్రజల్లోకి వెళ్తేనే భవిష్యత్ఉంటుందని, లేదంటే ఆల్టర్నేట్ నాయకత్వంపై దృష్టి పెడతామని హైకమాండ్ తేల్చి చెప్పింది. అయితే, అధిష్టానం హెచ్చరికలను రాష్ట్ర నేతలు ఏ మేరకు పట్టించుకుంటారో చూడాలి మరి.
