జమ్మూకాశ్మీర్‌‌‌‌ లో ఫ్లాష్ ఫ్లడ్స్.. 11 మంది మృతి.. ఏడుగురు గల్లంతు..!

జమ్మూకాశ్మీర్‌‌‌‌ లో ఫ్లాష్ ఫ్లడ్స్.. 11 మంది మృతి.. ఏడుగురు గల్లంతు..!
  • పూంచ్, రాజౌరి జంట జిల్లాలను ముంచెత్తిన వరద
  • వరదల్లో కొట్టుకుపోయిన వాహనాలు.. భారీగా ఆస్తి నష్టం
  • నాగాలాండ్‌‌లో 8 మంది దుర్మరణం
  • సీఎం నెఫియు రియో దిగ్భ్రాంతి

జమ్మూ: కుండపోతగా కురుస్తున్న వానలకు జమ్మూకాశ్మీర్​ఆగమవుతోంది. శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో కొండచరియలు విరిగిపడి, ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరిలో 11 మంది మరణించగా, మరో ఏడుగురు గల్లంతయ్యారు. వరద ఉధృతికి పదుల సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్‌‌లు బాధితులకు సాయం అందిస్తున్నాయి. 

పూంచ్ జిల్లాలోని సూరంకోట్ తహసీల్‌‌లో వరద తీవ్రత ప్రమాదకరంగా ఉంది. ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి లోయర్ ముర్రా గ్రామంలో కొండచరియలు విరిగిపడి ఒక ఇల్లు కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన అధికారులు.. రెండేళ్ల బాలుడు సహా ఐదు మృతదేహాలను వెలికి తీశారు. మిగిలిన ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

సాంగ్లా గ్రామంలో ఆకస్మిక వరదలకు ఒక ఇల్లు పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ ఘటనలో అబ్దుల్ హమీద్, ఆయన భార్య షరీఫా బేగం, కుమార్తె అరీబా, సోదరి మనీరా బేగం గల్లంతయ్యారు. నూనాబండి గ్రామంలో ఇల్లు కూలి నాజియా కౌసర్ (28) అనే మహిళ మరణించింది. ఆమె భర్త మొహమ్మద్ హఫీజ్, వారి ముగ్గురు పిల్లలు గాయాలతో బయటపడ్డారు. 

సంగ్లాని -సూరంకోట్‌‌లో ఇల్లు కూలి షాజైబ్ అహ్మద్ (22) మరణించగా, మార్హోట్ వాగులో కొట్టుకుపోయి ఈరమ్ అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ధుందాక్ లాథూంగ్ వంతెన వద్ద ఒక గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పూంచ్ జిల్లా హవేలీ తహసీల్‌‌లో ఇళ్లు కూలి ఒకరు మరణించగా, రాజౌరిలో వరదలో కొట్టుకువచ్చిన మరో మహిళ మృతదేహాన్ని వెలికితీశారు.

రాజకీయ కార్యక్రమాలను రద్దు చేసుకున్న నేతలు 

రాష్ట్ర హోదా కోసం ఢిల్లీలో జరగాల్సిన నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం ఒమర్ అబ్దుల్లా, రాష్ట్రంలో పరిస్థితి తీవ్రతను గమనించి తన ఢిల్లీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని జమ్మూకు తిరుగుపయనమయ్యారు. ‘‘వరదల దృష్ట్యా నేను వెంటనే జమ్మూ చేరుకుని క్షేత్రస్థాయి పరిశీలన చేయబోతున్నా. ప్రజల ప్రాణాలను కాపాడటమే మా మొదటి ప్రాధాన్యత. బాధితులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుంది” అని తెలిపారు. మరోవైపు, కాంగ్రెస్ స్థానిక ఎమ్మెల్యే ఇఫ్తికర్ అహ్మద్ కూడా పార్టీ నిరసన కార్యక్రమాన్ని రద్దు చేసుకుని, తన నియోజకవర్గానికి చేరుకున్నారు.

నాగాలాండ్‌‌ను కుదిపేసిన వర్షం

నాగాలాండ్​ను భారీ వర్షాలు కుదిపేశాయి. వర్షం ధాటికి మోన్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 8 మంది దుర్మరణం చెందారు. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు అధికారులు భావిస్తున్నారు. కొండచరియలు విరిగిపడడంతో పాటు ఆకస్మిక వరదలు వరదలు ముంచెత్తడంతో పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. 

స్థానిక స్వచ్ఛంద సేవకులు, పోలీసులు, ఆర్మీ సిబ్బందితో పాటు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌‌డీఆర్‌‌‌‌ఎఫ్‌‌) బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. మోన్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలతో  రోడ్లు బ్లాక్ అవ్వడమే కాకుండా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు భారీ నష్టం వాటిల్లింది. ఈ ఘోర ప్రమాదంపై నాగాలాండ్ సీఎం నెఫియు రియో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.