- ‘మిషన్ మోడ్ కాదు.. కమీషన్ మోడ్’.. అంటూ సర్కార్‌పై ఫైర్
- పెట్రోల్, డీజిల్‌పై 10% వ్యాట్ తగ్గించాలని సీఎంకు లేఖ
సిద్దిపేట, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి గారడీ మాటలు, ఢిల్లీ ట్రిప్పులకే పరిమితమయ్యారని, ఇకనైనా టూర్లు మాని రైతుల పంటలు కొనాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావ్ డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లలో వేగం పెరగకపోతే వేలాది మంది రైతులతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తానని ఆయన హెచ్చరించారు.
సోమవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి రైతులతో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వడ్ల కొనుగోళ్లలో సర్కార్ ది 'మిషన్ మోడ్' కాదని, 'కమీషన్ మోడ్' అని విమర్శించారు. రాష్ట్రంలో 1.40 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు దిగుబడి వస్తుందని అంచనా వేసి, 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని నిన్నటిదాకా చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇవాళ కేవలం 70 లక్షల టన్నులే కొంటామని ప్రకటించారన్నారు.
మిగతా వడ్లను దళారులకు అమ్ముకుని రైతులు నష్టపోవాలా అని ఆయన ప్రశ్నించారు. తరుగు తీస్తే తోలు తీస్తానని సీఎం రేవంత్ రెడ్డి, కఠిన చర్యలు తీసుకుంటానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏసీ రూముల్లో కూర్చుని ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. బస్తాకు 43 కిలోలు నింపితేనే దింపుకుంటామని మిల్లర్లు రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. ఎకరానికి 150 కిలోల చొప్పున నష్టపోతున్నామని రైతులు డీఎస్ఓకు చెప్తే, మిల్లర్లతోనే మాట్లాడుకోండని బాధ్యతారహితంగా సమాధానం ఇస్తున్నారని మండిపడ్డారు.
పెట్రోల్, డీజిల్‌పై 10% వ్యాట్ తగ్గించాలని సీఎంకు లేఖ
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను అడ్డగోలుగా పెంచిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్ తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. నిజంగా ప్రజా పాలనే అయితే ఇంధన ధరలపై కనీసం 10% వ్యాట్ తగ్గించాలని కోరుతూ సోమవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. వారంలో నాలుగు సార్లు ధరలు పెంచి కేంద్రం భారం మోపితే, రాష్ట్రం పన్నులు తగ్గించకపోవడం సరికాదన్నారు. పెరిగిన ధరల వల్ల సాగు ఖర్చులు పెరిగి రైతులు, రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో పడ్డాయన్నారు.
