అమిత్ షాను కలిసింది అందుకే..దారినపోయే వాళ్లు రాళ్లేస్తే ఊరుకోను: పవన్ కళ్యాణ్

అమిత్ షాను కలిసింది అందుకే..దారినపోయే వాళ్లు రాళ్లేస్తే ఊరుకోను: పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రత్యర్థులకు, విమర్శకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కామెంట్స్ వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో  సంచలనంగా మారాయి.

ఎవర్నో అరెస్ట్ చేయించడానికి తాను రాజకీయం చేయడం లేదన్న పవన్.. వైసీపీ నాయకుడు జైలుకు వెళ్లాలని తానెందుకు కోరుకుంటానని ప్రశ్నించారు. ఒకరు జైలుకు వెళ్తేనే జనసేన ఎదుగుతుందా? అని నిలదీశారు. హోంమంత్రితో తాను ఇలాంటి విషయాలు మాట్లాడుతానా అని ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్.. ఏపీ అభివృద్ధి కోసమే తాను కేంద్రమంత్రి అమిత్ షాను కలిశానని స్పష్టం చేశారు. అమిత్ షాతో తాను మాట్లాడిన విషయాలు బయట వాళ్లకు ఎలా తెలుస్తాయని, ఈ అంశంపై ఏపీ బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు.

ఇప్పటి వరకు అన్నీ భరించానని, ఇకపై భరించే ఓపిక తనకు లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. దారినపోయే వాళ్లంతా జనసేనపై రాళ్లు వేస్తానంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తమకు కోపాలు, బాధలు ఉంటాయని.. చూస్తూ ఊరుకుంటామని అనుకోవద్దన్నారు. దేనికైనా ఓ హద్దు ఉంటుందని, రెచ్చగొట్టడం సరికాదన్నారు.మీరు ఎదగడానికి నన్ను వాడుకుంటానంటే సహించను. మీరు రాళ్లేస్తూ వెళ్తుంటే మేం నవ్వుతూ ఉంటామా? ఇక భరించడాల్లేవ్.. అన్నింటికి పర్యవసనాలే ఉంటాయ్. భరిస్తాం, సహిస్తాం.. అవసరమైతే తాటతీస్తాం" అంటూ పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

అదే సమయంలో సొంత పార్టీ నేతలకు కూడా పవన్ గట్టి క్లాస్ పీకారు. శత్రువులు ఎక్కడో లేరని, మన పార్టీలోనే ఉన్నారని వ్యాఖ్యానించారు. జనసేనలోనూ అనేక అంశాలపై లీకులు ఇస్తున్న వాళ్లు ఉన్నారని.. ఉండగలిగే వాళ్లే పార్టీలో ఉండాలని స్పష్టం చేశారు. ఇప్పటికే నలిగి నలిగి ఉన్నామని, ఇకపై అలా కుదరదని.. ఇకపై జనసేన కట్టుదిట్టంగా ఉంటుందని చెప్పారు. శత్రువు బలంగా ఉన్నప్పుడే తాము బలంగా కొడతామన్నారు. వ్యక్తిగతంగా విమర్శిస్తే అంతే స్థాయిలో తిరిగిస్తానని హెచ్చరించారు.

జనసేన నాయకులు బలపడాలని.. కానీ నేతలు చప్పబడిపోయారని పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పదవులు రాగానే చాలామంది మెత్తబడిపోయారని, అలాంటి నాయకులు జనసేనకు అవసరం లేదన్నారు. తన ఆదేశాలు పాటించాలని, లేదంటే పార్టీ నుంచి తప్పుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. తాను టీడీపీ కోసం కాదు, రాష్ట్రం కోసమే సర్దుకుపోతున్నానని ఈ సందర్భంగా పవన్ గుర్తుచేశారు.

 మిగతా పార్టీ నేతలు కులం గురించి మాట్లాడటం లేదా? అని ప్రశ్నించారు పవన్ . తాను పదే పదే కులం గురించి మాట్లాడుతానని అంటుంటారని.. కానీ తాను ఎప్పుడైనా కుల నాయకుడినని చెప్పానా? అని నిలదీశారు. తమను విమర్శించని వాళ్లను విమర్శిస్తే కులం అడ్డొస్తుందా అని అడిగారు. తాను కులాల కోసం రాలేదని, తాను ఒక కులం మనిషిని కాదని పవన్ స్పష్టం చేశారు. కులాలన్నింటినీ రెచ్చగొట్టే మెంటాలిటీ మంచిది కాదన్నారు.

తమిళనాడు రాజకీయాలను ప్రస్తావిస్తూ.. అక్కడ రాజకీయాలు ఎంతో సాఫీగా జరిగాయని, తనకు అసూయ కలిగేంత సుఖంగా సాగాయన్నారు. అక్కడ కటౌట్లు, హలోగ్రామ్స్ పెట్టుకుని గెలిచేసి సీఎంలు అయ్యారని.. కానీ తనను మాత్రం 15 ఏళ్లు రోడ్డు మీద దేకించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఈ స్థాయికి రావడానికి 12 ఏళ్లు పట్టిందని.. రాజకీయ పార్టీ నడపడం అంత ఈజీ కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు పవన్ .