- ఆరోగ్యం, వాసన, రుచికి ప్రయారిటీ
- ప్యాకేజ్డ్ రిఫైన్డ్ ఆయిల్స్‌ను పక్కన పెడ్తున్న జనం
- జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో
- జయశంకర్ వర్సిటీ స్టడీలో వెల్లడి
హైదరాబాద్, వెలుగు:
ప్రతి వంటకంలో కీలకమైన వంట నూనెల విషయంలో ప్రజలు తమ వైఖరి మార్చుకుంటున్నారు. నిన్న మొన్నటి దాకా రిఫైన్డ్ ఆయిల్స్ వాడిన జనం.. ఇప్పుడు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు క్రమంగా గానుగ నూనె (కోల్డ్ ప్రెస్ ఆయిల్) వైపు మొగ్గు చూపుతున్నారు. ‘వేడి చేయరు.. కెమికల్స్ కలపరు.. కండ్ల ముందే నూనె తీస్తారు’ అనే నమ్మకంతో గానుగల ముందు క్యూ కడుతున్నారు.
ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వంట నూనె విషయంలో జనం ప్రయారిటీ పూర్తిగా మారిపోయిందని ఓ స్టడీలో తేలింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్టులు ఎన్.మేరి, బి. సౌజన్య తదితరులు చేసిన రీసెర్చ్‌లో ఈ విషయాలు బయటపడ్డాయి.
రీసెర్చ్ కోసం అగ్రికల్చర్ వర్సిటీ సైంటిస్ట్‌లు జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో 30 ప్రాసెసింగ్ యూనిట్ల పరిధిలోని ఏరియాలను ఎంపిక చేసుకున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 55 శాతం మంది తాము గానుగలో పట్టిచ్చిన కోల్డ్‌ప్రెస్ ఆయిల్‌నే వాడుతున్నామని చెప్పారు. 45 శాతం మంది మాత్రమే రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నట్లు తేలింది. రిఫైన్డ్ ఆయిల్ తయారీలో భాగంగా దానిని 200 డిగ్రీల వరకు వేడి చేయడం, కెమికల్స్ వాడడంతో ప్రజలు దాని వాడకాన్ని తగ్గిస్తున్నట్లు తేలింది.
అదే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అయితే 35 డిగ్రీల ఉష్ణోగ్రత మించకపోవడంతో పోషకాలు(న్యూట్రియెంట్స్) పుష్కలంగా ఉండడంతో పాటు నూనె క్వాలిటీగా ఉంటుందని జనాలు నమ్ముతున్నారు.
వర్గాలవారీగా లెక్కలు..
గానుగ నూనె వాడుతున్న వారిలో ఏ వర్గాలు, ఏ వయస్సు వారు ఉన్నారన్న విషయాన్ని సైతం అగ్రికల్చర్ వర్సిటీ సైంటిస్టులు లెక్క తీశారు. సాధారణంగా 46 నుంచి 55 ఏండ్ల వయసున్న వారిలో 63.34 శాతం ఆరోగ్యం మీద ధ్యాసపెట్టి ఈ నూనెలు వాడుతున్నారని వెల్లడైంది. చదువుకున్న వారిలో, అందులో డిగ్రీలు చేసిన గ్రాడ్యుయేట్లు 48.34 శాతం మంది ఈ కోల్డ్‌ప్రెస్ ఆయిల్ ఆయిల్ వైపు చూస్తున్నారని తేలింది.
అలాగే ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు (43.34 శాతం) ఎక్కువగా గానుగ నూనె కొంటున్నారు. అదేవిధంగా నెలకు రూ.26 వేల నుంచి రూ.35 వేల మధ్య సంపాదిస్తున్న మధ్య తరగతి వారు (38.33 శాతం) ఈ నూనెల ధరలు ఎక్కువైనా.. ఆరోగ్యం ముఖ్యమని భావించి నువ్వుల నూనెనే కొనుగోలు చేస్తున్నట్లు
సర్వేలో తేలింది.
ట్రెడిషనల్ యూసేజ్ అంటూ..
గానుగ పట్టిచ్చిన నూనెల వైపు జనం మళ్లడానికి ప్రధాన కారణం ‘ట్రెడిషనల్ యూసేజ్’.. అంటే తా తల నాటి పద్ధతి అని50 శాతం మంది ఇటువైపు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. అదే విధంగా ఇలా గానుగ పట్టించిన నువ్వుల నూనె వాసనే హైలైట్‌గా నిలుస్తోంది. ఈ నూనె నుంచి వచ్చే ఘాటైన సువాసనను (ఓడర్) చూసే కొంటున్నామని 38.34 శాతం మంది చెప్పారు.
అలాగే క్వాలిటీ బాగుంటుందని 26.6 శాతం మంది, టేస్ట్ మంచిగా ఉంటుందని 25 శాతం మొగ్గు చూపారు. హెల్త్ బెనిఫిట్స్ విషయంలో చూస్తే ప్రధానంగా ఈ నూనెలను ప్రెస్‌చేసి తీయడంతో ఇందులో పోష కాలు మెండుగా ఉంటాయని (38.34 శాతం).. కొవ్వు కరిగి, మెటబాలిజం పెరుగుతుందని (20 శాతం), చర్మం, జుట్టుకు మంచిదని (13.34 శాతం) మంది నమ్ముతున్నట్లు స్టడీలో తేలింది.
పెరుగుతున్న వినియోగం
సగటున నలుగురు ఉన్న కుటుంబంలో గానుగ నూనె వాడకం 46.66 శాతం పెరుగుతున్నట్లు ఈ స్టడీలో తేలింది. ప్రధానంగా ఉమ్మడి కుటుంబాల్లో గానుగ నూనె వాడకం ఎక్కువగానే ఉంది. జనం ఎక్కువగా 2 నుంచి 5 లీటర్ల క్యాన్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రతి 2 నుంచి 5 నెలలకోసారి నూనెను కొంటున్నట్లు వెల్లడైంది. ఉత్తర తెలంగాణలో జనాలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో ‘రిఫైన్డ్ ఆయిల్’ కాలం చెల్లిపోయి, ‘గానుగ నూనె’కే భవిష్యత్ ఉంటుందని అగ్రికల్చర్ వర్సిటీ రీసెర్చ్‌లో స్పష్టమైంది.
సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం
పాత కాలపు విధానమైన గానుగ నూనె విషయం ప్రజలకు ఎలా తెలుస్తోందన్న విషయంపైనా సైంటిస్ట్‌లు ఫోకస్ చేశారు. దీంతో మొబైల్ ఇంటర్నెట్ వాడకం గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించడంతో పాటు సోషల్ మీడియా కీలకంగా మారిందని గుర్తించారు. యూట్యూబ్, వాట్సప్, ఫేస్‌బుక్ వంటి సోషల్‌మీడియా ద్వారానే 30 శాతం మంది ప్రజలకు ఈ నూనెలపై అవగాహన వచ్చినట్లు తేలింది. దీనికి తోడు మౌత్ టాక్ సైతం కీలకంగా మారింది.
ఫ్రెండ్స్, రిలేటివ్స్ చెబుతుంటే విన్నవాళ్లు, హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సలహాలు పాటించేవాళ్లు కూడా ఈ గానుగ నూనె వాడే వారిలో ఎక్కువే ఉన్నారు. వీటితో పాటు హైపర్ మార్కెట్‌లు, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్‌లలో సైతం కోల్డ్ప్రెస్అయిల్స్ అమ్మకం జనాలను ఆకర్షిస్తున్నాయి.
