T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగే కీలక మ్యాచ్‌కు ముందు భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు సూపర్-8లో తొలి పోరు. 2024లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌లో తలపడిన ఈ రెండు జట్లు ఇప్పుడు మరోసారి పోటీ పడుతున్నాయి.
ఈ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ని మళ్లీ తుది జట్టులోకి తీసుకురావాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అలా జరిగితే వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్‌కు బెంచ్‌కే పరిమితం కానున్నాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్న అక్షర్, ఇప్పుడు సూపర్-8లో తిరిగి టీంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు.
అక్షర్ ఈ వరల్డ్ కప్‌లో అద్భుతంగా బౌలింగ్‌లో రాణిస్తున్నాడు. కేవలం 3 మ్యాచ్‌ల్లోనే 6 వికెట్లు తీసి, 6.63 ఎకానమీతో భారత్ తరఫున రెండో అత్యధిక వికెట్లు తీయగా.. బంతితో పాటు బ్యాట్‌తో కూడా కీలక పాత్ర పోషించగలగడంతో జట్టుకు విలువైన ఆటగాడిగా మారాడు. ఇక యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా మూడుసార్లు డకౌట్లు అయినప్పటికీ, అతడ్ని తుది జట్లులోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ విషయంపై ప్రీ-మ్యాచ్ ప్రెస్‌మీట్‌లో సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు.
ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుండటంతో, భారత్ 4 పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. దీంతో కుల్దీప్ యాదవ్ మరోసారి తుది జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉంది. జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ తో పాటు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే బౌలింగ్ బాధ్యతలు పంచుకుంటారు. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించనున్నారు.
భారత్ ప్లేయింగ్ ఎలెవన్:
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
