రాజస్థాన్‎లో దారుణం: పెళ్లికి గంటల ముందే విషం తాగి అక్కాచెల్లెలు మృతి

రాజస్థాన్‎లో దారుణం: పెళ్లికి గంటల ముందే విషం తాగి అక్కాచెల్లెలు మృతి

జైపూర్: ఇద్దరు కూతుర్ల పెళ్లి ఒకే రోజు.. ఒకే మండపం.. ఒకే ముహూర్తానికి చేయాలని ఆ తల్లిదండ్రులు కలలుగన్నారు. అనుకున్నట్టుగానే ఒకే తేదీన అక్కాచెల్లెల పెళ్లి నిశ్చయించారు. మరికొన్ని గంటల్లో పెళ్లి.. బంధువులు, బ్యాండ్ మేళాలతో ఇళ్లంతా పెళ్లి సందడి.. ఇంతలో అక్కాచెల్లెలు ఇద్దరు విషం ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి వరకు పెళ్లి బాజాలతో కళకళలాడిన ఆ ఇంట్లో చివరకు చావు డప్పులు మోగాయి. ఈ విషాద ఘటన రాజస్థాన్‎లో చోటు చేసుకుంది. 

వివరాల ప్రకారం.. జోధ్‌పూర్ సమీపంలోని మనై గ్రామానికి చెందిన అక్కాచెల్లెలు శోభ (25), విమల (23)ల పెళ్లి 2026, ఫిబ్రవరి 21న నిశ్చయించారు కుటుంబ సభ్యులు. పెళ్లికి ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి. తెల్లారితే పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే అక్కాచెల్లెలు ఇద్దరు ఇంట్లో అపస్మారక స్థితిలో పడిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జోద్‎పూర్‎లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకునేలోపే ఇద్దరూ మృతి చెందారని వైద్యులు ప్రకటించారు. 

దీంతో కుటుంబ సభ్యులు శోభ, విమల అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో కోడళ్ల మరణంపై అనుమానంతో మృతుల మేనమామ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‎మార్టానికి తరలించారు. పోస్ట్‎మార్టంలో శోభ, విమల పాయిజన్ తాగి చనిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణం కావచ్చని.. ఇష్టం లేని పెళ్లి చేస్తుండటంతోనే అక్కాచెల్లెలు సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరికొన్ని గంటల్లో పెళ్లి చేసుకుని కొత్త జీవతం ప్రారంభించాల్సిన బిడ్డలు అర్ధాంతరంగా జీవితాన్ని ముగించడంతో మృతుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పెళ్లికి వచ్చిన బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇద్దరూ యువతులు ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడంతో మనై గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.