విద్యార్థులపై పోలీసుల దాడికి జవాబు చెప్పితీరాల్సిందే.. అమిత్ షాను డిమాండ్ చేసిన రాహుల్ గాంధీ

విద్యార్థులపై పోలీసుల దాడికి జవాబు చెప్పితీరాల్సిందే.. అమిత్ షాను డిమాండ్ చేసిన రాహుల్ గాంధీ
  •     మౌనంగా ఉంటే సద్దుమణుగుతుందని అనుకోవద్దని క్లారిటీ

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ పై జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేసిన విద్యార్థులపై పోలీసుల దాడులు అమానుషమని, దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్​షా జవాబు చెప్పాల్సిందేనని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ‘విద్యార్థుల మీద పోలీసులు జరిపిన అమానుష దాడిపై మౌనంగా ఉంటామంటే కుదరదు.. ఇప్పుడో, ఇంకొన్నాళ్లకో అమిత్​ షా జవాబు చెప్పితీరాల్సిందే’ అంటూ రాహుల్ గాంధీ ఆదివారం ట్వీట్ చేశారు. 

శనివారం ప్రయాగ్​రాజ్​లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమంలో ఓ విద్యార్థి తనతో పంచుకున్న ఆవేదనను ఎక్స్​లో వివరించారు. ‘నీట్ పరీక్ష కోసం ఏళ్ల తరబడి చదివా, ఫీజులు కట్టేందుకు, ప్రిపరేషన్ కోసం మా కుటుంబానికి ఉన్న కొద్దిపాటి భూమిని అమ్ముకున్నాం. నా తల్లిదండ్రులు అప్పులపాలయ్యారు. నేను, నా కుటుంబం ఇంత కష్టపడ్డా ఇప్పుడు ఎలాంటి ప్రతిఫలం లేకుండా పోయింది. నాకిప్పుడు ఏ ఆప్షన్ మిగల్లేదు’ అంటూ నీట్ బాధిత విద్యార్థి వాపోయాడని తెలిపారు.

 ఇందులో ఆ విద్యార్థి ఫెయిల్యూర్ ఎంతమాత్రమూ లేదని, అతని కష్టానికి ప్రతిఫలం దక్కకుండా చేసింది లోపభూయిష్టమైన మన విద్యావ్యవస్థేనని రాహుల్ మండిపడ్డారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన పూర్తయి రోజులు గడిచిపోతున్నా కూడా వారిపై జరిగిన అమానుష దాడికి కేంద్ర హోంమంత్రి నుంచి ఒక్క ప్రకటన కూడా లేదని, కనీస విచారం కూడా లేదని రాహుల్ విమర్శించారు. ఇక, ప్రధాని నరేంద్ర మోదీ విషయానికి వస్తే.. విద్యార్థులకు క్షమాపణ చెప్పాల్సింది పోయి అందరినీ క్షమించడంలో ఆయన బిజీగా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. 

‘‘అమిత్​ షా జీ.. కొన్నాళ్లు మౌనంగా ఉంటే అంతా సద్దుమణుగుతుందనే ఆలోచన కలలో కూడా రానివ్వకండి. మీరు మౌనంగా ఉన్నా సరే.. జవాబుదారీతనం కోసం మేం డిమాండ్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే, దేశ రాజధాని వీధుల్లో విద్యార్థులపై బాటన్స్ ఉపయోగించారు, పెల్లెట్ గన్స్ ప్రయోగించారు. ఈ నేరానికి మీరు జవాబు చెప్పితీరాల్సిందే” అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.