కోజికోడ్: కేరళలోని పాలక్కడ్ జిల్లాలో ఘోరం జరిగింది. స్థానికులు ఓ వలస కార్మికుడిని బంగ్లాదేశీగా పొరబడి మూకదాడి చేసి చంపేశారు. ఇష్టమొచ్చినట్లు కొట్టడంతో బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని రామ్ నారాయణ్ బఘేల్ (31) గా గుర్తించారు. చత్తీస్గఢ్లోని శక్తి జిల్లాకు చెందిన రామ్ నారాయణ్.. ఉపాధి కోసం కేరళకు వలసవెళ్లాడు. పనికోసం రోజూ తిరుగుతున్నాడు.
ఈ నెల 17న పాలక్కడ్ జిల్లాలోని అత్తపల్లం గ్రామంలో కొంతమంది స్థానికులు అతడిని బంగ్లాదేశీగా అనుమానించారు. దొంగతనం ఆరోపణ మోపుతూ బంధించారు. ఇంతలోనే కొంతమంది నీ గుర్తింపు ఏమిటని ప్రశ్నిస్తూ కొట్టడం ప్రారంభించారు. ‘నువ్వు బంగ్లాదేశీవి, నీ భాష ఏంటి? నీ ఊరు ఏది?’ అంటూ అందరూ కలిసి కొట్టడంతో తలకు తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగింది. ఛాతీ నుంచి కూడా బ్లడ్ కారిపోయింది.
అతడి శరీరంపై 80కి పైగా గాయాలయ్యాయి. తర్వాత దుండగులు పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 18న ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.
