ఎలక్షన్‌ కమిషనర్‌ పదవికి అశోక్‌ లావాస రాజీనామా

ఎలక్షన్‌ కమిషనర్‌ పదవికి అశోక్‌ లావాస రాజీనామా

కేంద్ర ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లావాస తన పదవికి రాజీనామా చేశారు. లావాస తన రాజీనామాను మంగళవారం(ఆగస్టు-18) రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు సమర్పించినట్లు సమాచారం. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదిస్తే ఆగస్టు 31 నుంచి ఆయన విధుల నుంచి రిలీవ్‌ కానున్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ఉపాధ్యక్షుడిగా సెప్టెంబర్‌లో నూతన బాధ్యతలు చేపట్టనుండటంతో ఆయన ఎన్నికల కమిషనర్‌గా వైదొలిగారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా పదవీ విరమణ చేయనుండటంతో తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా అశోక్‌ లావాస కీలక బాధ్యతలను చేపట్టాల్సి ఉంది. అయితే పూర్తి పదవీకాలం ముగియకుండానే పదవి నుంచి వైదొలగిన రెండవ ఎన్నికల కమిషనర్‌గా అశోక్‌ లావాస నిలిచారు.

అశోక్‌ లావాస హర్యాణ క్యాడర్‌కు చెందిన పదవీ విరమణ చేసిన 1980 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. 2018 జనవరిలో ఆయన ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. అశోక్‌ లావాస 2016 జూన్‌ నుంచి అక్టోబర్‌ 2017 వరకూ భారత ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు. పర్యావరణ, పౌరవిమానయాన కార్యదర్శిగా కూడా ఆయన వ్యవహరించారు.