
- రెచ్చగొడితే మనపై అణుబాంబులు వేయొచ్చన్న కాంగ్రెస్ నేత
- ఇదే కాంగ్రెస్ పార్టీ విధానమంటూ బీజేపీ ఫైర్
న్యూఢిల్లీ : మొన్న ఇండియన్ల కలర్‌పై కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు మరువకముందే ఆ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి. పాకిస్తాన్వద్ద అణుబాంబులు ఉన్నాయని, అందుకే దాయాదిని భారత్ గౌరవించాలని అన్నారు. పాకిస్తాన్‌తో చర్చలు జరపాలని, లేకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపారు. సైన్యంతో ఆ దేశాన్ని రెచ్చగొడితే మనపై అణుబాంబులు ప్రయోగించే ఆలోచన చేయొచ్చని కామెంట్ చేశారు. ‘మనవద్ద కూడా అస్త్రాలున్నాయి. కానీ, ఓ పిచ్చివాడు అణుబాంబును లాహోర్‌పై ప్రయోగించాలని నిర్ణయిస్తే.. దాని తాలూకు రేడియేషన్ అమృత్సర్ను చేరడానికి 8 సెకన్లు కూడా పట్టదు’ అని వ్యాఖ్యానించారు. మణిశంకర్ అయ్యర్ ఓ టీవీ ఇంటర్వ్యూలో కొద్దిరోజుల క్రితం మాట్లాడిన వ్యాఖ్యలు తాజాగా వైరల్ అయ్యాయి. అయితే, లోక్‌సభ ఎన్నికల వేళ ఆయన కామెంట్స్ వైరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలోకి నెట్టేశాయి. కాగా, మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని, ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని కాంగ్రెస్ ప్రకటించింది.
ఇదే కాంగ్రెస్ ఐడియాలజీ : బీజేపీ
ఇండియా పట్ల కాంగ్రెస్ ఐడియాలజీ ఇదేనంటూ మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. మణిశంకర్ వీడియోను ట్విట్టర్ (ఎక్స్)లో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ షేర్ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ రియల్ ఐడియాలజీ బయటపడుతోందని అన్నారు. “పాకిస్తాన్‌కు సపోర్ట్ చేయడం, అవసరమైతే అండగా ఉండటం.. సియాచిన్‌ను వదులుకోవడం, ప్రజలను విభజించడం, అబద్దాలు, నకిలీ గ్యారంటీలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం.. ఇవే వారి సిద్ధాంతాలు’’ అని రాజీవ్ చంద్రశేఖర్ దుయ్యబట్టారు.