న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారాయని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నదని ఫైర్ అయ్యారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను, హక్కులను లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీస్‌లో ఆదివారం కాంగ్రెస్ 140వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు.
అనంతరం, మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలతోనే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఇండియా నిలదొక్కుకుందని, సమాజాన్ని ముందుకు నడపడమే కాంగ్రెస్ ఆలోచన అని అన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేదని, కాంగ్రెస్ తీసుకొచ్చిన సంస్కరణలను మోదీ ప్రభుత్వం తక్కువ చేస్తున్నదని అంటూ విమర్శలు గుప్పించారు.
‘‘కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఎప్పుడూ పాకులాడలేదు. రాజ్యాంగ విలువలు, లౌకికవాదం, పేదల హక్కుల విషయంలో మేము ఎన్నడూ రాజీ పడబోం. కాంగ్రెస్ బలహీనపడిందని విమర్శించే వారికి ఇదే మా సమాధానం. మా శక్తి తగ్గి ఉండొచ్చు. కానీ.. మా వెన్నుముక ఇంకా నిటారుగానే ఉంది. మేము తలవంచే ప్రసక్తే లేదు’’ అని ఖర్గే అన్నారు.
ద్వేషం, అణిచివేత పెరుగుతున్నయ్
దేశంలో ద్వేషం, అన్యాయం, అణచివేత పెరుగుతున్నాయని, వీటికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పూర్తి శక్తితో పోరాడుతున్నదని ఖర్గే అన్నారు. ‘‘కాంగ్రెస్ ఎప్పుడూ మత ప్రాతిపదికన ఓట్ల కోసం పాకులాడలేదు. దేవాలయాలు, మసీదులు, చర్చిల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేయలేదు. కాంగ్రెస్ అందరినీ కలుపుకుపోతది. బీజేపీ మాత్రం కులం, భాష, మతం పేరుతో జనాలను విభజిస్తున్నది. కాంగ్రెస్ అంటేనే.. ఒక సిద్ధాంతం. సిద్ధాంతాలు ఎప్పటికీ ఎన్నటికీ మరణించవు. దేశంలోని ప్రతి పౌరుడికి కుల, మత, వర్గ విభేదాలు లేకుండా సమాన అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన సిద్ధాంతం’’అని ఖర్గే అన్నారు.
కాంగ్రెస్ ఆవిర్భావం.. పోరాటం..
కాంగ్రెస్ పార్టీని 1885, డిసెంబర్ 28న ఒక రిటైర్డ్ బ్రిటిష్ అధికారి ఏవో హ్యూమ్ స్థాపించారు. ప్రారంభంలో దీని ఉద్దేశ్యం స్వాతంత్ర్యం సంపాదించడం కాదు. కేవలం ఇండియన్స్ సమస్యలను బ్రిటిష్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, విద్యావంతులైన భారతీయులకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించడం మాత్రమే. అయితే, మొదటి 20 నుంచి 30 ఏండ్ల పాటు కాంగ్రెస్ కేవలం నగరాల్లోని చదువుకున్న వారు, అడ్వకేట్లు, సంపన్నులకే పరిమితమై ఉండేది.
1915లో గాంధీజీ ఇండియాకు తిరిగొచ్చాక కాంగ్రెస్ పార్టీ గ్రామాలకు విస్తరించింది. రైతులు, కార్మికులు, సామాన్యులు ఇందులో భాగస్వాములయ్యారు. బ్రిటీష్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం మొదలుపెట్టారు. స్వాతంత్ర్య వచ్చాక కాంగ్రెస్‌ను రాజకీయ పార్టీగా కొనసాగించకుండా ‘లోక్ సేవక్ సంఘ్’ అనే సామాజిక సేవా సంస్థగా మార్చాలని గాంధీజీ భావించారు. రాజకీయ అధికారం కోసం కాకుండా ప్రజాసేవ కోసం పార్టీ పనిచేయాలని ఆయన కోరుకున్నారు.
కాంగ్రెస్.. దేశ ఆత్మకు ప్రతిరూపం: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అది దేశ ఆత్మకు ప్రతిరూపం అని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. బలహీన వర్గాలకు, అణగారిన వారికి, కష్టపడి పనిచేసే ప్రతి భారతీయుడికి కాంగ్రెస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘‘ద్వేషం, అన్యాయం, నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతాం. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, సత్యం, ధైర్యంతో కూడిన యుద్ధాన్ని మరింత బలంగా కొనసాగిస్తాం’’అని రాహుల్ పేర్కొన్నారు.
