కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వివాదంలో చిక్కుకున్నారు. సుమారు పదేళ్ల క్రితం కుదుర్చుకున్న ఒక ఒప్పందాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ప్రముఖ నిర్మాణ సంస్థ తేనాండల్ ఫిల్మ్స్ ఆయనకు లీగల్ నోటీసులు పంపింది. దాదాపు రూ. 20 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని ఆ నోటీసులో హెచ్చరించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
అసలు ఏం జరిగిందంటే?
తేనాండల్ ఫిల్మ్స్ చెబుతున్న వాదన ప్రకారం.. 2016లో ధనుష్ తమ బ్యానర్‌లో ‘నాన్ రుద్రన్’ అనే సినిమా చేయడానికి సంతకం చేశారని ఆరోపిస్తుంది. అయితే, ఆ ప్రాజెక్ట్ అనుకున్న విధంగా ముందుకు సాగలేదు. ఆ సమయంలో అదే బ్యానర్‌లో తాను హీరోగా నటించడమే కాకుండా, స్వయంగా దర్శకత్వం కూడా వహించి ఒక సినిమా పూర్తి చేస్తానని ధనుష్ ప్రామిస్ చేశారని తెలిపింది. ధనుష్ ఇచ్చిన ఈ హామీతో ఈ ప్రాజెక్టు కోసం తేనాండల్ ఫిల్మ్స్ భారీగా పెట్టుబడులు పెట్టింది. సినిమా షూటింగ్ కోసం భారీ సెట్లు కూడా ఏర్పాటు చేసింది.
అంతే కాకుండా ఈ ప్రాజెక్టులో కీలక పాత్రల కోసం టాలీవుడ్ కింగ్ నాగార్జున, నటుడు ఎస్ జే సూర్య వంటి వారికి కూడా అడ్వాన్సులు చెల్లించినట్లు చెబుతోంది. అయితే ఈ మూవీ స్క్రిప్ట్ పూర్తి చేయడంలో ధనుష్ పూర్తిగా విఫలమయ్యారని .. ఇతర సినిమాలకు కాల్ షీట్లు ఇస్తూ.. తమ ప్రాజెక్టును పక్కన పెట్టేశారని నిర్మాణ సంస్థ ప్రధానంగా ఆరోపిస్తోంది.
రూ. 20 కోట్లు కట్టాల్సిందే..
ధనుష్ చేసిన నిర్లక్ష్యం, జాప్యం వల్ల తమకు రూ. 20 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని తేనాండల్ ఫిల్మ్స్ పేర్కొంది. ఒక వారం రోజుల్లోగా ధనుష్ స్పందించాలని, తమ సినిమాను ఎప్పుడు పూర్తి చేస్తారో క్లారిటీ ఇవ్వాలని కోరింది. ఒకవేళ ధనుష్ ఈ ఒప్పందాన్ని గౌరవించకపోతే.. ఉల్లంఘన కింద తాము పెట్టిన రూ. 20 కోట్లతో పాటు అదనంగా రూ. 1 కోటి నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేసింది. లేని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
వరుస వివాదాలతో..
ఇటీవలి కాలంలో ధనుష్ వరుస వివాదాల్లో నిలుస్తున్నారు. గత ఏడాది నయనతార వెడ్డింగ్ డాక్యుమెంటరీ విషయంలో రూ. 10 కోట్ల నష్టపరిహారం కోరుతూ ఆయన నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్వయంగా ఆయనే రూ. 20 కోట్ల వివాదంలో చిక్కుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఒక వైపు ఈ వివాదాలు కొనసాగుతున్నా.. తన కెరీర్ పరంగా ధనుష్ దూసుకుపోతున్నారు. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘D55’ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఇందులో మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. అలాగే ఇళయరాజా బయోపిక్ , ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లోనూ ధనుష్ నటించబోతున్నారు. మరి ఈ రూ. 20 కోట్ల వివాదంపై ధనుష్ ఎలా స్పందిస్తారో చూడాలి .
