అతను బ్యాట్ పడితే సిక్సరే. స్పిన్ బౌలింగ్ అయినా.. పేస్ బౌలింగ్ అయినా.. ఈ చిచ్చరపిడుగుకు తెలిసిందల్లా అటాకింగ్ బ్యాటింగ్ ఒక్కటే. బ్యాట్ పడితే బాదుడే. ఫాస్టెస్ట్ సెంచరీల స్పెషలిస్ట్. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్న యువ తేజం వైభవ్ సూర్యవంశీ పదో తరగతి పరీక్షలు రాయడానికి ప్రిపేర్ అవుతున్నాడు.
బ్యాట్కు రెస్ట్ ఇచ్చి పుస్తకాలను ముందేసుకుని కుస్తీ పడుతున్నాడు. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి బీహార్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. బీహార్లోని సమస్తిపూర్ పోడార్ ఇంటర్నేషనల్ స్కూ్ల్లో వైభవ్ సూర్యవంశీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నాడు. క్రికెట్ ప్రపంచానికి కొన్నాళ్లు దూరంగా.. పెన్నూపుస్తకాలకు దగ్గరగా సూర్యవంశీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. అకడమిక్ పిచ్లో సిక్సులు, ఫోర్లు కొట్టాల్సిన టైమొచ్చింది.
క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తమ పాఠశాలలో 10వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరు కానున్నాడని పోడార్ ఇంటర్నేషనల్ స్కూ్ల్ ప్రిన్సిపాల్ తెలిపారు. అతనికి ఇప్పటికే అడ్మిట్ కార్డు అందిందని, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ అతనిని చూసేందుకు ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. అయితే, అతను ఇప్పటికీ విద్యార్థేనని.. పరీక్షకు హాజరు కానున్నందున.. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తాము ఏర్పాట్లు చేశామని స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పారు. ఇది క్రికెట్ పిచ్ కాదు, అకడమిక్ పిచ్ అని గుర్తుచేశారు. విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో అందరినీ సమానంగా చూస్తామని.. అన్ని సౌకర్యాలు అందరికీ ఒకేలా ఉంటాయని ప్రిన్సిపాల్ నీల్ తెలిపారు.
