దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్(LCU)తో తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకున్న సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. 'ఖైదీ', వి'క్రమ్', 'లియో' వంటి బ్లాక్‌బస్టర్ల చిత్రాలతో దర్శకుడిగా మెప్పించారు. ఇప్పుడు ఆయన మేకప్ వేసుకుని వెండితెరపై హీరోగా విశ్వరూపం చూపించడానికి సిద్ధమయ్యారు. ఆయన కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'డీసీ' (Devadas + Chandra).
రక్తపాతంతో కూడిన ప్రేమకథ!
ఈ రోజు (ఫిబ్రవరి 14) ప్రేమికుల రోజు సందర్భంగా, చిత్ర యూనిట్ 'బ్లడీ వాలంటైన్' పేరుతో ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది. సాధారణంగా ప్రేమికుల రోజున ప్రేమ, అనురాగం నిండిన వీడియోలు వస్తుంటాయి. కానీ లోకేష్ సినిమా అంటే వయొలెన్స్ ఉండాల్సిందే కదా! ఈ గ్లింప్స్ అంతా రక్తపాతంతో నిండిపోయింది. ఇందులో లోకేష్ కనగరాజ్ శత్రువుల పీకలు కోస్తూ అత్యంత కిరాతకమైన లుక్‌లో కనిపించారు. చివర్ లో కారుపై చిందిన రక్తం చూస్తుంటే, సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో అర్థమవుతోంది. చిన్న వీడియోలోనే ఇంత హింస ఉంటే, ఇక వెండితెరపై లోకేష్ సృష్టించే విధ్వంసం ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు.
టైటిల్ వెనుక ఆసక్తికర కథ
ఈ చిత్రానికి 'డీసీ' అనే టైటిల్ పెట్టడం వెనుక ఒక ప్రత్యేకత ఉంది. సినిమాలో లోకేష్ దేవదాస్ గా, బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి చంద్రగా నటిస్తున్నారు. వీరిద్దరి పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి 'DC'గా టైటిల్ ను డిసైడ్ చేశారు. శరత్ చంద్ర ఛటోపాధ్యాయ రాసిన క్లాసిక్ 'దేవదాస్' నవలకు ఇది ఒక మోడరన్, వయొలెంట్ వెర్షన్ అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్రాన్ని 'కెప్టెన్ మిల్లర్' ఫేమ్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. లోకేష్ తొలిసారి నటుడిగా ఈ ఏడాది సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దర్శకుడిగా సెన్సేషన్ క్రియేట్ చేసిన లోకేష్, హీరోగా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి మరి.
