హైదరాబాద్: కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఆఫీసుకు వెళ్లి ఇంటికి తిరిగి వెళుతున్న ప్రైవేటు ఉద్యోగిని కారుతో ఢీ కొట్టి పోకిరీలు పైశాచిక ఆనందం పొందిన ఘటన కలకలం రేపింది. ఆకతాయిలు కారుతో వ్యక్తిని ఢీ కొట్టి కిలోమీటర్ మేర లాక్కుపోయిన ప్రమాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
చర్లపల్లికి చెందిన సతీష్ కుమార్ బంజారా హిల్స్కు.. ఉద్యోగం నిమిత్తం వెళ్లి ఇంటికి తిరిగి మిత్రులతో కలిసి కారులో వెళుతుండగా ఇద్దరు పోకిరి యువకులు కారుతో ఢీ కొట్టారు. సతీష్ కుమార్ వెళుతున్న కారును ఢీ కొట్టి సైరన్ వేసుకొని పారిపోతూ తరువాత సిగ్నల్ దగ్గర ఆగారు. ఆగి ఉన్న ఆకతాయిలను ఏంటిందని సతీష్ కుమార్ ప్రశ్నించాడు. సతీష్ కుమార్ ప్రశ్నిస్తుండగానే ఆకతాయిలు కారుతో మళ్లీ ఢీ కొట్టడంతో సతీష్ కుమార్ బానెట్పై పడిపోయాడు.
పడిపోయిన సతీష్ కుమార్ను ఈడ్చుకొని వెళ్తుండగా.. కారు నెంబర్ ప్లేట్ బంపర్ను పట్టుకొని సుమారు కిలోమీటర్ దూరం అతనిని ఆకతాయిలు తీసుకెళ్లారు. దీంతో తీవ్ర గాయాలపాలై ఆకతాయిల కారును సతీష్ కుమార్ వదిలేయడంతో కారు వెనుక టైరు మీది నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో సతీష్ కుమార్ ఒంటికి తీవ్ర గాయాలు కావడంతో పాటు తన మర్మాంగాలకు కూడా తీవ్రంగా గాయపడడంతో వైద్యులు ఆపరేషన్ చేశారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం జరిగింది.
సతీష్ కుమార్ మిత్రులు కుషాయిగూడ పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సతీష్ కుమార్ను కక్షపూరితంగా వాహనంతో ఢీ కొట్టి పైశాచిక ఆనందం పొందిన ఇద్దరు వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
