- జలాంతర్గామిలో ప్రయాణించిన తొలి మహిళా రాష్ట్రపతిగా రికార్డు
బెంగళూరు: ప్రెసిడెంట్, సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము కల్వరి క్లాస్ సబ్‌మెరైన్‌లో ప్రయాణించారు. ఆదివారం కర్నాటకలోని కర్వార్ నావెల్ బేస్ నుంచి ఐఎన్ఎస్ వాఘ్‌షీర్‌లో ముర్ము ప్రయాణం చేశారు. ఆమె వెంట ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె త్రిపాఠి ఉన్నారు. నేవీ యూనిఫాం ధరించిన ప్రెసిడెంట్ ముర్ము.. సబ్ మెరైన్‌లోకి దిగే ముందు అక్కడికి వచ్చిన నేవీ అధికారులు, సిబ్బందికి అభివాదం చేశారు. సబ్ మెరైన్ డెక్ పైన, లోపల ఐఎన్ఎస్ వాఘ్ షీర్ సిబ్బందితో ఫొటోలు దిగారు.
నావికాదళ సిబ్బందితో ముర్ము మాట్లాడుతూ.. దేశం పట్ల వారి అంకితభావం, నిస్వార్థ సేవా స్ఫూర్తిని ప్రశంసించారు. భారత నావికాదళ నైపుణ్యం, పోరాట సంసిద్ధత, దేశ భద్రత పట్ల నిబద్ధతకు స్వదేశీ జలాంతర్గామి వాఘ్‌షీర్ ఒక ఉదాహరణ అని ఆమె కొనియాడారు. కాగా, ప్రెసిడెంట్ ముర్ము సబ్‌మెరైన్‌లో ప్రయాణించడం ఇదే తొలిసారి. అయితే, మాజీ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం ఈ కల్వరి క్లాస్ సబ్‌మెరైన్‌లో ప్రయాణించిన మొదటి ప్రెసిడెంట్‌కాగా, ద్రౌపది ముర్ము రెండో రాష్ట్రపతిగా నిలిచారు. మహిళా రాష్ట్రపతుల్లో తొలివ్యక్తిగా రికార్డుకెక్కారు.
వాఘ్‌షీర్ ప్రత్యేకతలు..
ఐఎన్ఎస్ వాఘ్‌షీర్ భారత నావికాదళానికి చెందిన కల్వరి-క్లాస్ డీజిల్- ఎలక్ట్రిక్ అటాక్ సబ్ మెరైన్. దీనిని ఫ్రాన్స్ నావల్ గ్రూప్ లైసెన్స్‌తో ముంబైకి చెందిన మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) నిర్మించింది. దీనిని యాంటీ సర్ఫేస్, యాంటీ సబ్ మెరైన్ వార్ ఫేర్ కార్యకలాపాలతో పాటూ నిఘా, స్పెషల్ ఆపరేషన్లలోనూ ఉపయోగించుకోవచ్చని నేవీ వర్గాలు తెలిపాయి.
